‘ఖని’ ధర్మాస్పత్రిలో రాబంధులు
డబ్బుల కోసం రోగులకు సిబ్బంది వేధింపులు
డెలివరీ అయినందుకు రూ.వెయ్యి డిమాండ్
కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తున్న వారిని సిబ్బంది డబ్బుల కోసం పీడిస్తున్నారు. శనివారం ఓ మహిళకు ప్రసవం చేయగా.. ఆమె కుటుంబసభ్యుల నుంచి సిబ్బంది రూ.వెయ్యి డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని రూ.600 సమర్పించుకుంటే.. మెుత్తం ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశారు. దీంతో సదరు సిబ్బందిపై బాధితులు ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం... గోదావరిఖని జవహర్‌నగర్‌కు చెందిన పోరండ్ల వైకుంఠం, స్వరూప దంపతుల రెండవ కూతురు అనూష రెండవ కాన్పు కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది. శనివారం వైద్యులు ప్రసవం చేశారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బాలింత అనూషతోపాటు శివువును బయటకు తీసుకొచ్చిన సిబ్బంది రూ.వెయ్యి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న అనూష తండ్రి వైకుంఠం రూ.500 ఇచ్చాడు. అవి సరిపోవని సిబ్బంది తీసుకోవడానికి నిరాకరించడంతో మరో రూ.వంద కలిపి రూ.600 ఇచ్చాడు. అయినా సంతృప్తి చెందని సిబ్బంది రూ.వెయ్యి ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో వైకుంఠం సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆస్ప్రత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీకి ఫిర్యాదు చేశాడు. పేదల దగ్గర లంచాల పేరుతో ఎలా వసూలు చేస్తున్నారని సిబ్బందితోపాటు సూపరింటెండెంట్‌ను నిలదీశాడు. ఆస్పత్రిలో చాలామంది నుంచి రూ.వెయ్యి నుంచి రూ.మూడువేల వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. సిబ్బంది మాత్రం తాము ఎవరీ దగ్గరా డబ్బులు డిమాండ్ చేయలేదని పేర్కొనడం పేర్కొనడం గమనార్హం.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం...
–సూర్యశ్రీ, సూపరింటెండెంట్
ఆస్పత్రిలో సిబ్బంది డబ్బుల కోసం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుండా చూస్తాం. అవినీతిని అరికట్టడానికి త్వరలోనే ఆస్పత్రిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తాం. ఆస్పత్రిలో లంచాలు అడగటం, ఇవ్వడం నేరం.