కల్యాణ వైభోగమే..
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజును స్కంధరాత్రి అంటారు. ఈ రోజున స్వామి, అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శనివారం రాత్రి 11.45 గంటలకు ఊరేగింపు ప్రారంభమైంది. రెండు గంటలకు గజ వాహనంపై సుబ్రమణ్యస్వామి సమేతుడైన సోమస్కంధమూర్తి పెండ్లి మండపానికి చేరుకున్నారు. సింహవాహనంపై వచ్చిన జ్ఞానప్రసూనాంబ నెహ్రూవీధి ప్రారంభంలో నిలిచిపోయారు. వేదిక వద్ద వేదపండితులు, పూజారులు శాస్త్రోక్తంగా హోమం వెలిగించి పూజలు చేశారు. అలాగే గణపతి హోమం, గౌరీవ్రతం, మాంగల్యవ్రతం, మహామాంగల్యవ్రతం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటలకు కల్యాణం జరిగింది. వివాహం అనంతరం స్వామి, అమ్మవార్లు పట్టణ పురవీధుల్లో విహరించి ఆలయానికి చేరుకున్నారు.
ఆసక్తిగా చండికేశ్వరుని రాయబారం
పరమేశ్వరుని భక్తుడైన చండికేశ్వరుడు పర్వతరాజు వద్ద రాయబారం నెరిపే ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. శ్రీకాళహస్తీశ్వరస్వామికి పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని పర్వతరాజును చండికేశ్వరుడు కోరతారు. అందుకు పర్వతరాజు అంగీకరించరు. అనంతరం చండికేశ్వరుడు స్వామి వద్దకు వచ్చి ఆయన చెప్పిన మాటలు చెబుతారు. చివరకు స్వామి ఇచ్చిన ఏకబిల్వం (మారేడుదళం)తో పార్వతీదేవినిచ్చి వివాహం చేయడానికి పర్వతరాజు అంగీకరిస్తారు. తర్వాత అమ్మవారి వాహనం పెండ్లి మండపం వద్దకు చేరుకుంది.
శాస్త్రోక్తంగా మాంగల్యధారణ
చండికేశ్వరుని రాయబార మహోత్సవం పూర్తయ్యాక స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచారు. అనంతరం వేదమంత్రాలు, వేలాదిమంది భక్తుల సాక్షిగా శివపార్వతుల వివాహం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో ఉదయం 3.45 గంటలకు మాంగల్యధారణ జరిగింది. పసుపు బియ్యంతో కలిపిన ముత్యాల తలంబ్రాలను అర్చకులు స్వామి, అమ్మవారిపై పోస్తూ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. తలంబ్రాల కోసం భక్తులు పోటీపడ్డారు. వేదిక చుట్టూ ప్రదక్షిణం తర్వాత నైవేద్యం, దీపారాధన కార్యక్రమాలు జరి గాయి.
అనంతరం నవదంపతులైన స్వామి, అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. ఆల యంలో అభిషేకాల అనంతరం ఆదివారం ఉదయం తిరిగి చతుర్మాడావీధుల్లో స్వామి, అమ్మవారిని ఊరేగించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర, నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఈఈ రామిరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, వెంకటేశ్వరరాజు, హరిబాబుయాదవ్, పీఆర్వో సుదర్శన్‌నాయుడు, పట్టణ పెద్దలు పీఆర్మొహన్, అమర్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కటైన 362 జంటలు
స్వామి, అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకుని పెండ్లి మండపం వద్ద 162 వివాహాలు జరిగినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీంద్రబాబు తెలియజేశారు. పెండ్లి మండపం వద్దకు రాకుండా సమీపంలోని సత్రాలు, ఆలయాలు, లాడ్జీలలో రెండు వందలకు పైగా వివాహాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
పటిష్ట భద్రత
స్వామి, అమ్మవారి కల్యాణోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అయినా కొందరు ఆకతాయిలు చోరీలకు యత్నించారు. నలుగురిని అదువులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాల్యవివాహాలు జరగకుండా కల్యాణోత్సవానికి ముందు సీఐ శ్రీనివాసులు వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు.