నమ్మించి...వంచించాడు..
► చెల్లి పెళ్లికి వడ్డీకి డబ్బు తెచ్చిన పవన్
► తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని సోమశేఖర్‌ను అడగటంతోనే హత్య
ప్రత్తిపాడు: అవసరమంటే అప్పు ఇచ్చాడు.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటే నమ్మకంగా వెళ్లాడు... ఇచ్చిన రుణమే యమపాశమవుతుందని గ్రహించలేకపోయాడు... అప్పుతీసుకున్న వ్యక్తే అభం శుభం తెలియని యువకుడిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే తుమ్మలపాలెంకు చెందిన కోనంకి పవన్‌కుమార్‌ది సామాన్య కుటుంబం. తండ్రి చిలకలూరిపేటలో ని ఓ ఆయిల్ మిల్లులో కూలీగా పనిచేస్తాడు. తల్లి వ్యవసాయ పనులకు వెళుతుంది. ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లి సునీతకు కొంతకాలం కిందట వివాహం చేశారు. తాజా గా నెలన్నర కిందట రెండవ చెళ్లి లక్ష్మికి కూడా వివాహం చేశారు. వివాహం చేసేందుకు డబ్బులు లేకపోవడంతో వడ్డీకి అప్పు తెచ్చి చేశారు. పవన్‌కుమార్‌కు కూడా వివాహమైంది. పదకొండు నెలల పసికందు ఉన్నాడు.
ఆ అప్పు తిరిగి చెల్లించేందుకు ..
కొద్ది నెలల కిందట కోనంకి పవన్‌కుమార్ మంగళగిరికి చెందిన తలతోటి సోమశేఖర్‌ను నమ్మి అతనికి ఐదు లక్షల రూపాయలు ఇంటి డాక్యుమెంట్లు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పుగా ఇచ్చాడు. చెల్లి వివాహ సమయంలో డబ్బుల్లేక అప్పు చేశామని, ఆ డబ్బును తిరిగి మేం చెల్లించాల్సి ఉందని, తనకు ఇవాల్సిన ఐదులక్షలు తిరిగి ఇచ్చేయాలంటూ పవన్‌కుమార్ సోమశేఖర్‌ను ఇటీవల తరచుగా అడుగుతున్నాడు. తన వద్ద డబ్బులు లేవని, ఇంటి డాక్యుమెంట్లు తీసుకొస్తే అవి వేరే వాళ్ల దగ్గర తనఖా పెట్టి డబ్బులు ఇస్తానని సోమశేఖర్ పవన్‌కు చెప్పినట్లు సమాచారం. దీంతో నిజమేనని నమ్మ వెళ్లిన పవన్‌కుమార్ చివరకు దారుణ హత్యకు గురయ్యాడు.
చివరి చూపునకు కూడా నోచని వైనం..
సోమశేఖర్ చేతిలో దారుణ హత్యకు గురైన కోనంకి పవన్‌కుమార్‌ను కడసారి చూసుకునే అవకాశం కూడా కుటుంబ సభ్యులకు లేకుండా పోయింది. చంపేసి తగలబెట్టడం, అస్తికలను నదిలో కలపడంతో పవన్‌కుమార్ కుటుంబ సభ్యుల వేదన అరణ్యరోదనగా ఉంది. కడసారి చూసుకునేందుకు కూడా అవకాశం లేకపోవడంతో భార్యతో పాటు తల్లిదండ్రులు కుమిలికుమిలి ఏడుస్తున్నారు. వారి ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.