మనిషి బరువు భూమ్మీద ఒకేలా ఉండదు!
కడుపు మాడ్చుకోకుండా.. కసరత్తు చేయకుండా బరువు తగ్గాలనుందా? అయితే, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లిపోండి.. బరువు తగ్గిపోతుంది! ఒకే వ్యక్తి భూమి మీద వివిధ ప్రాంతాల్లో బరువు చూసుకుంటే.. అది వేర్వేరుగా ఉంటుందట. దీనికి కారణం భూమ్యాకర్షణ శక్తిలో ఉండే హెచ్చుతగ్గులేనని ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన క్రిస్టియన్ హిర్ట్ తెలిపారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఓ కొత్త హై రిజల్యూషన్ మ్యాప్‌ను తయారుచేశారు.
ఈ ధరణి మీద భూమ్యాకర్షణ అన్ని చోట్లా ఒకేలా ఉంటుందని మనం భావిస్తున్నా.. అది వేర్వేరుగా ఉంటుందని.. ఎందుకంటే భూమి కచ్చితమైన గోళాకార రూపంలో ఉండకపోవడం.. సాంద్రత కూడా ఒకేతీరున ఉండకపోవడం ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ‘ముఖ్యంగా భూమధ్య రేఖ వద్ద భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. భూభ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే కేంద్రపరాన్ముఖ శక్తుల వల్ల ఇలా జరుగుతుంది’ అని వీరు పేర్కొన్నారు.
భూమధ్యానికి సమీపంలోని ఎత్తై ప్రాంతాల్లోనూ భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉంటుందని చెప్పారు. వీరు ఉపగ్రహాల నుంచి సేకరించిన భూమ్యాకర్షణ శక్తి సమాచారాన్ని, టోపోగ్రాఫిక్ సమాచారాన్ని కలిపి.. భూమ్యాకర్షణ శక్తిలో మార్పులకు సంబంధించిన అత్యంత స్పష్టమైన హైరిజల్యూషన్ మ్యాప్‌ను రూపొందించారు.
ఇందులో మొత్తం 300 కోట్ల పాయింట్లకు సంబంధించిన భూమ్యాకర్షణ శక్తిని గణించారు. ఇందుకోసం సూపర్ కంప్యూటర్ను వినియోగించారు. దీని ప్రకారం పెరూలోని నెవాడో హువాస్కరన్ పర్వతం వద్ద భూమ్యాకర్షణ శక్తి అత్యంత తక్కువగా ఉండగా.. అర్కిటిక్ సముద్రతలంపై అత్యధికంగా ఉంది.