వైఎస్సార్ సీపీలో కొట్టు చేరిక
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం తన అనుచరులతో కలసి బుధవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు వెళ్లిన ఆయన వైఎస్సార్ సీపీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు వైఎస్ జగన్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొట్టు సత్యనారాయణతోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు గుండుమోగుల సాంబయ్య, మాజీ డైరెక్టర్ గుండుబోగుల నాగు, మాజీ ఎంపీటీసీ సభ్యులు బండారు నాగు, వంకా కామేశ్వరరావు, కన్నాజీ మోహనరావు, శిరిగినీడి విజయకుమార్, హరిదాసుల రవీంద్రకుమార్, వెలనాటి సత్తిబాబు, బత్తిరెడ్డి రత్తయ్య, రెడ్డి శ్రీనివాసరెడ్డి, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు, మాజీ సర్పంచ్ పిచ్చికల రాజారావు, ఆర్యవైశ్య సంఘ నాయకులు చిట్టూరి కాశీవిశ్వనాథం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన వెలిశెట్టి నరేంద్ర, సూర్పని రవికుమార్ తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ అగ్రనాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తానేటి వనిత, ఉంగుటూరు, గోపాలపురం నియోజకవర్గాల కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు పాల్గొన్నారు.
‘కొట్టు’ వర్గంలో జోష్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ రూ.600 కోట్లతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు మెండుగా ఉండటంతో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఉద్యాన యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ పాలిటెక్నిక్ వంటి సంస్థలను వెంకట్రామన్నగూడెంలో నెలకొల్పారు. పట్టణంలో రాజీవ్ గృహకల్ప సముదాయం, రెండో ఫ్లై ఓవర్ వంతెన, ఎర్రకాలువపై వంతెనలు వంటి గుర్తుండిపోయే నిర్మాణాలు చేయించారు. వైఎస్ మరణానంతరం స్తబ్దుగా ఉండిపోయిన సత్యనారాయణ ఆ తరువాత టీడీపీలో చేరారు. గడచిన ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కొట్టు వైఎస్సార్ సీపీలో చేరడంతో ఆయన వర్గీయులు జోష్‌తో ఉన్నారు.