Welfare Education
-
విద్యకు వందనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం సంక్షేమ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడానికి పలు పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆదాయ పరిమితికి లోబడి నూరు శాతం ఈ వర్గాల వారికి దేశంలోనే ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 25,86,392 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించి చదివించడం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఉచిత విద్యను అందించడం ప్రధాన ఉద్దేశం. వైఎస్సార్ విద్యోన్నతి పథకం కింద ఉచితంగా సివిల్స్‌కు కోచింగ్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా విదేశీ విద్య, స్కిల్ అప్‌గ్రేడేషన్ ద్వారా ఉచితంగా కొత్త కోర్స్‌లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, ప్రీమెట్రిక్ సంక్షేమ హాస్టళ్లు, సంక్షేమ పీజీ హాస్టళ్ల ద్వారా ఉచితంగా విద్యను ప్రభుత్వం అందిస్తోంది. దీని కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ విద్యకు రూ.4,980 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దీనికి అదనంగా ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలు పిల్లలకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కలిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘ఆహార బుట్ట’తో పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నారు. అమ్మఒడి పథకం కింద పిల్లలను స్కూళ్లకు పంపిస్తే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఉచితంగా అన్ని వర్గాల్లోని ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు పొందుతున్న పేద విద్యార్థులు (లక్షల్లో..) ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.20 వేలు... ప్రభుత్వం కొత్తగా మెయింటెనెన్స్ చార్జీలు (ఎంటీఎఫ్) కింద వసతి, భోజన సౌకర్యాల కోసం ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.20 వేలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. మెస్ చార్జీల కింద ఒక్కో పీజీ విద్యార్థికి నెలకు రూ.1,400లు ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి రూ.14,000 ఖర్చవుతున్నది. ఇవి కాకుండా మరో రూ.6 వేలు కలిపి సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తారు. ఇంత భారీ స్థాయిలో విద్యార్థుల వసతి సౌకర్యాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం దేశంలోనే మొదటిసారి ఏపీలో అమలవుతున్నది. -
‘సంక్షేమ’ పండుగ!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల టీడీపీ పాలనలో నీరసించిన సంక్షేమ విద్యకు వైఎస్సార్ సీపీ జీవం పోస్తుందనే ఆశాభావం అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో సంక్షేమానికే పెద్దపీట వేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు జవసత్వాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారని అధికారులు భావిస్తున్నారు. 648 హాస్టళ్లను రద్దు చేసిన టీడీపీ రాష్ట్రంలో సంక్షేమ శాఖల ద్వారా సగం బడ్జెట్ విద్యకే ఖర్చు చేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు, సివిల్స్ కోచింగ్, విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా సంక్షేమ విద్యా బోధన జరుగుతోంది. సాంఘిక సంక్షేమ శాఖలో 648 హాస్టళ్లను రద్దు చేసిన టీడీపీ వాటి స్థానంలో కొత్త గురుకుల స్కూళ్లను మాత్రం ఏర్పాటు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించింది. ప్రస్తుతం ఉన్న స్కూళ్లలోనే వీటిని విలీనం చేయడంతో అరకొర వసతి, తరగతి గదులు చాలక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. విద్యాసంస్థల మరమ్మతులకు వెచ్చించాల్సిన నిధులు పచ్చ చొక్కాల జేబుల్లోకి చేరిపోయాయి. పైపైన రంగులు వేసి నిధులు దోచేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధుల వ్యయం జరుగుతోంది. టీడీపీ పాలనలో రాష్ట్ర స్థాయిలో పనులన్నీ ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతో సప్లై, నాణ్యతలో లోపాలు తలెత్తాయి. గతేడాది బకాయిలు రూ.8 వేల కోట్లు విద్యా సంస్థలకు పైసా కూడా బకాయిలు లేకుండా సంక్షేమ విద్యను అందించడం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క ఏడాది కూడా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో చెల్లించలేదు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ ఇంకా రూ.8 వేల కోట్ల బకాయిలు కాలేజీలకు విడుదల కాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. గిరిజన సంక్షేమ విద్యలో పూర్తి స్థాయి మార్పులు గిరిజన సంక్షేమ విద్యలో పూర్తి స్థాయి మార్పులు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గురుకుల విద్య, ప్రాథమిక విద్య, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే ఓ నివేదిక తయారు చేసింది. నూతన ముఖ్యమంత్రి దీన్ని ఆమోదించిన తరువాత అమలు చేయాలనే ఆలోచనలో ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉన్నారు. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమ హాస్టళ్లను పూర్తిగా రద్దు చేసింది. దీంతో అటు గురుకుల విద్య అందక, సంక్షేమ హాస్టళ్లు లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. రద్దు చేసిన కొన్ని హాస్టళ్లనైనా తిరిగి పునరుద్ధరించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలను పూర్తి స్థాయిలో గురుకులాలుగా మారిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ అంశాలపై అధికారులు నూతన ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సబ్సిడీ రుణ పథకాలను నీరుగార్చిన చంద్రబాబు పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు ఉద్దేశించిన సబ్సిడీ రుణాల పథకాల కింద ఏటా ఐదు లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం సంవత్సరానికి కనీసం 50 వేల మందికి కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీ రుణాలను ఇవ్వలేకపోయింది. సంక్షేమ రంగాన్ని చంద్రబాబు పూర్తిగా విస్మరించారనేందుకు ఇది నిదర్శనం. గిరిజనులు, ఎంబీసీల గృహాలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాల్సిన విద్యుత్ హామీ కూడా సక్రమంగా అమలు కాలేదు. ఎంబీసీలకు ఒక్కరికి కూడా ఉచిత విద్యుత్ అందలేదు. జీవో అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి తమకు మార్గదర్శకాలు లేవని విద్యుత్ శాఖ చెబుతోంది. గత ప్రభుత్వం కేవలం జీవోలకే పరిమితమైంది. ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు. ఏఎస్‌డబ్లు్యవో కార్యాలయాల పరిధి మార్పు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ కార్యాలయాల పరిధిలో మార్పులు తెచ్చేందుకు సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయం నివేదిక తయారు చేసింది. ప్రతి నాలుగైదు మండలాలకు ఒక ఏఎస్‌డబ్ల్యూవో ఉంటే బాగుంటుందనే యోచనలో డైరెక్టర్ ఉన్నారు. గుంటూరు లాంటి పెద్ద జిల్లాలకు ఇద్దరు అధికారులను నియమించాలని భావిస్తున్నారు. ఒక డిప్యూటీ డైరెక్టర్ జిల్లా కేంద్రంలో ఉంటున్నందున మరో ప్రధాన కేంద్రం నుంచి కూడా పర్యవేక్షించడం ద్వారా పనులు వేగంగా జరుగుతాయని పేర్కొంటున్నారు. ఈమేరకు నివేదిక రూపొందించి త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం 90 మంది ఏఎస్డబ్లు్యవోలను సర్దుబాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్నారు. స్టడీ సర్కిళ్లకు జేడీలను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తే నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని అధికారులు యోచిస్తున్నారు. -
సంక్షేమమా..అదెక్కడ!?
సాక్షి, అమరావతి: గత నాలుగేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమాన్ని అటకెక్కించింది. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలుకాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన ఏజెన్సీల్లో ఆదివాసీల జీవితాలు దారుణంగా ఉన్నాయి. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో వారికి అందటంలేదు. విజయనగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీల పరిస్థితి దారుణంగా ఉంది. గూడేలకు కనీస వసతుల్లేవు. తాగేందుకు ఊట చెలిమల నుంచి వస్తున్న నీరే దిక్కు. గూడేలకు దూరంగా వైద్యశాలలు ఉండటం, సిబ్బంది సకాలంలో చేరుకునే పరిస్థితి లేకపోవడంతో వైద్యం అందని ద్రాక్షలా మారింది. రోడ్డు సౌకర్యాల్లేవు. రూ.400 కోట్లతో రోడ్లు వేస్తున్నామని మాత్రం ప్రభుత్వం నాలుగేళ్లుగా ప్రచారం చేసుకుంటోంది. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నిర్వీర్యమైంది. బినామీల గుప్పెట్లో ఎస్సీల ఫలాలు ఇక ఎస్సీ సంక్షేమ పథకాలు బినామీలు ఎగరేసుకుపోతున్నారు. ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం కార్ల కొనుగోలు పథకం ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఇవి ఎస్సీల పేరుతో పలువురు ఎమ్మెల్యేల బంధువులు, మంత్రుల బంధువుల వద్దకు చేరాయి. భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది. రూ.200 కోట్లతో 4333 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు 75శాతం సబ్సిడీపై ఇచ్చినట్లు ప్రకటించింది. కానీ, నాలుగేళ్లలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. - ఇక ఫీజు రీయింబర్స్మెంట్ విషయానికి వస్తే మొత్తం రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.800కోట్లు బకాయి ఉన్నారు. - మైనార్టీలకు రూ.500కోట్లకు మించి ఖర్చుపెట్టిన దాఖలాల్లేవు. వైఎస్సార్ హయాంలో స్వర్ణ యుగాన్ని చవిచూసిన ఆ వర్గం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. - బీసీల్లో కుల వృత్తుల వారికి ఇస్తామన్న ఆదరణ పనిముట్లు ఇప్పటివరకూ ఇవ్వలేదు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఉంటే ఏటా రుణాలు ఇచ్చేందుకు 50వేల మందినే ఎంపిక చేస్తున్నారు. అయినా, అందులో 25వేల మందికి కూడా ఇవ్వడంలేదు. - ఆదాయ పరిమితి పెట్టడంవల్ల చాలా కుటుంబాల వారు ‘పెళ్లి కానుక’ పథకానికి దూరమవుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన వధూవరులు 3,034 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క జంటకు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు. - అలాగే, గిరిజనులకు ఉద్దేశించిన గిరిపుత్రిక కళ్యాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్క కొత్త జంటకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. ముస్లింల కోసం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం కూడా అలంకారప్రాయంగా మారింది. ఒక్కరికీ ఈ పథకం లబ్ధిచేకూర్చలేదు. అలాగే, బీసీలకు ప్రభుత్వం కొత్తగా రూ.35వేలు ఇస్తామని ప్రకటించింది. వీరి విషయంలోనూ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. కులాంతర వివాహాలు చేసుకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం మెలిక పెట్టింది. - సంప్రదాయ చర్మకారుల జీవనోపాధి కోసం రూ.60 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు. - మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి గత ఏడాది రూ.60 కోట్లు, ఈ సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించారు. ఒక్కరికి కూడా సాయం అందించలేదు. స్టడీ సర్కిళ్లు నిర్వీర్యం ఇదిలా ఉంటే.. సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీ సర్కిళ్లు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రభుత్వం వాటి గురించి ఆలోచించడం మానేసింది. దీంతో.. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ కోచింగ్‌కు దూరమవుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఉన్నా వాటిల్లో ఫ్యాకల్టీలు లేరు. మొక్కుబడిగా ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ ఈ పథకం కింద విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థి యూనివర్సిటీలో చేరి అడ్మిషన్ వివరాలు పంపిస్తే మొదటి విడతగా రూ.5లక్షలు విడుదల చేస్తారు. సంవత్సరం ముగిసే సమయంలో మరో రూ.5లక్షలు ఇస్తారు. కానీ, విదేశాల్లో పీజీ చదవాలంటే కనీసం రూ.30 లక్షలు ఖర్చవుతాయి. బ్యాంకుల నుంచి రూ.10 లక్షలు రుణం ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఉన్నతి లేని ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్‌లో ఉచిత కోచింగ్‌కు సంబంధించి గత ఏడాది బీసీ, ఈబీసీలు కలిపి 1,240 మందికి, కాపులు 700 మందికి, ఎస్సీలు 700 మంది, ఎస్టీలు 300 మందిని ఎంపిక చేసి శిక్షణకు పంపించారు. ఒక్క బీసీలే సుమారు 50వేల మంది వరకు పరీక్ష రాశారు. మెరిట్ ప్రకారం ఎక్కువమందికి కోచింగ్ ఇప్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, శిక్షణ పొందిన వారికి నేటికి కూడా స్టైఫండ్ పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. దీంతో హాస్టళ్ల నిర్వాహకులు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. అక్కరకు రాని ‘చంద్రన్న బీమా’ ఇక ‘చంద్రన్న బీమా’ పథకం ద్వారా పేదలకు సకాలంలో సాయం అందటంలేదు. ఈ పథకానికి కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి సుమారు రూ.600కోట్లు దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి బీమా సొమ్ములో సగం కేంద్ర ప్రభుత్వ వాటా కాగా, మిగిలిన సగం రాష్ట్రానిది. కానీ, బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. తన వాటాను కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి తీసుకుని చెల్లిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, చిన్న పిల్లలకు తప్ప పెద్ద పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడంలేదు. అలాగే, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు రూ.2,000లు పింఛన్ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అదీ ఇవ్వడంలేదు. ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం రాష్ట్రంలో ఐదేళ్లలో 13 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నా పథకం మాత్రం ముందుకు సాగడంలేదు. బిల్లులు చెల్లించకపోవడమే కారణం. మరోవైపు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. 23వేల ఇళ్లు నిర్మించామని రాష్ట్రం అంటే.. కాదు, 7,749మాత్రమే అని కేంద్రం అంటోంది. దీంతో కేంద్రం బిల్లులు చెల్లించడంలేదు. అలాగే, మరో 20.97 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్రం మరో ఉత్తరం రాసింది. దీంతో.. మొదట 23 వేల ఇళ్లకు లెక్కలు చెప్పండి అంటూ కేంద్రం ప్రత్యుత్తరం ఇవ్వడంతో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఇక అర్బన్ హౌసింగ్ పథకం కింద దాదాపు 6 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 4,934 ఇళ్లు మాత్రమే పూర్తిచేశారు. 2019 నాటికి 5 లక్షల గృహాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినా ఆ మేరకు నిర్మాణాలు మాత్రం చేపట్టడంలేదు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఇళ్ల కోసం 12 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నా వీరి గురించి పట్టించుకునే నాథుడేలేడు. చేనేత, మత్స్య కారులందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని.. మధ్య తరగతి వర్గాల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఇప్పటివరకు అతీగతీలేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత దానిని రూ.1.50 లక్షలకు కుదించి పేదలను మోసం చేశారు. ఇలా హామీల మీద హామీలు ఇవ్వడం మినహా పేదలకు మాత్రం సొంతింటి కల నెరవేర్చలేదు. సంక్షేమ హాస్టళ్ల రద్దు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ హాస్టళ్ల రద్దు పర్వం మొదలైంది. మెరుగైన విద్యను అందించేందుకు హాస్టళ్లను రద్దుచేసి ఆ స్థానాల్లో గురుకుల విద్యాలయాలు పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించి పేదలను మోసం చేసింది. - మొత్తం ప్రీమెట్రిక్ కింద ఎస్సీల హాస్టళ్లు 1,450కు గాను ఇప్పటివరకు 648 రద్దయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 27,917 మంది. - అలాగే, మొత్తం 197 ఎస్టీ హాస్టళ్లకుగాను అన్నీ రద్దయ్యాయి. వీటిలో 16,250మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. - బీసీ హాస్టళ్లదీ దాదాపు ఇదే పరిస్థితి. మొత్తం 897 హాస్టళ్లకుగాను 201 రద్దయ్యాయి. వీటిలో 13,000మంది విద్యనభ్యసిస్తున్నారు. - ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఒక్క గురుకుల పాఠశాల కూడా నిర్మించలేదు. రద్దుచేసిన ఎస్టీ హాస్టళ్ల స్థానంలో 80 హాస్టల్ కన్వర్టెడ్ గురుకుల పాఠశాలలు, ఏజెన్సీలో 30 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఇవన్నీ రద్దుచేసిన పాత భవనాల్లోనే కొనసాగుతుండగా అక్కడి పరిస్థితులు పాత హాస్టళ్ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. - కేంద్ర ప్రభుత్వం 14 ఏకల్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి భవన నిర్మాణాలకు నిధులిచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే విషయంలో తలెత్తిన వివాదం కోర్టుకు చేరడంతో ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కమీషన్ల విషయంలో తేడా రావడంతో ఈ భవనాలు ఆగిపోయినట్లు సమాచారం. -
అ‘డ్రస్’ లేదాయే!
రంపచోడవరం : ఏటా గిరిజన విద్యకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, గిరిజన బాలలపై నిర్లక్ష్యం తప్పడం లేదు. పక్కాగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అంతంతమాత్రంగా కల్పిస్తున్నారు. ఏటా ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గిరిజన విద్యార్థులకు పాఠశాల ప్రారంభంలోనే దుస్తులు అందించాల్సి ఉండగా, పాఠశాలలు తెరిచి నెల రోజులైనా నేటికీ అందించలేదు. గత ఏడాదీ ఇవ్వలేదు ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 59, వసతి గృహలు 22 ఉన్నాయి. వీటిలో దాదాపు 14 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఏటా వీరికి నాలుగు జతల దుస్తులు అందజేయాలి. దీనికిగాను ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తారు. 2011-12 విద్య సంవత్సరంలో 20,084.50 మీటర్ల క్లాత్ ఉండగా, 2013-14 విద్య సంవత్సరానికి 1718.57 మీటర్ల క్లాత్ ఇండెంట్ పెట్టారు. 2014-15 విద్య సంవత్సరంలో 1,29,194 మీటర్ల క్లాత్ ఇండెంట్ పెట్టారు. అయితే 2013-14 విద్య సంవత్సరంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. దీంతో చొక్కాలకు క్లాత్ ఉంటే, ఫ్యాంట్లకు క్లాత్‌లు లేని పరిస్థితి నెలకొంది. అయితే 2013-14 విద్య సంవత్సరంలో కొత్తగా ఆశ్రమ పాఠశాలలో చేరిన విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయలేదు. రంపచోడవరం మండలంలోని ఒక ఆశ్రమ పాఠశాలలో గత ఏడాది ఐదో తరగతిలో చేరిన విద్యార్థులకు విద్య సంవత్సరం ముగిసినా కనీసం ఒక జత దుస్తులు కూడా అందలేదు. దీంతో గిరిజన విద్యార్థులపై ఎంత నిర్లక్ష్యం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే వీరు 2014-15 విద్య సంవత్సరంలోకి వచ్చినా నేటికీ ఒక జత దుస్తులు కూడా ఇవ్వలేక పోయారు. విద్యార్థుల దుస్తుల కోసం క్లాత్‌ను నేరుగా పాఠశాలలకు పంపితే దుర్వినియోగమవుతుందనే ఉద్దేశంతో ఐటీడీఏ రంపచోడవరంలోని ఫ్యాషన్ టెక్నాలజీ సెంటర్లో కుట్టించి పాఠశాలలకు సరఫరా చేసేది. అయితే ఈ ఏడాది మళ్లీ తిరిగి క్లాత్‌ను నేరుగా పాఠశాలలకు పంపి, సంబంధిత హెచ్ఎంలు దుస్తులు కుట్టించి విద్యార్థులకు అందించాలని గిరిజన సంక్షేమ విద్య విభాగం వారు తెలిపారు. అయితే మారుమూల ప్రాంతాల్లోని టైలర్ల సమస్య ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు దుస్తులు కుట్టించి, పాఠశాల ప్రారంభం నాటికి కనీసం రెండు జతలు అందిస్తే బాగుంటుంది. కానీ ఐటీడీఏ పట్టించుకోవడం లేదు. దుస్తులు ఇవ్వడానికి చర్యలు గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణికుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది పూర్తి స్థాయిలో విద్యార్థులకు దుస్తులు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే క్లాత్‌ను పాఠశాలలకు అందించాం.