సాక్షి, అమరావతి: గత నాలుగేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమాన్ని అటకెక్కించింది. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలుకాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలైన ఏజెన్సీల్లో ఆదివాసీల జీవితాలు దారుణంగా ఉన్నాయి. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో వారికి అందటంలేదు. విజయనగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏల పరిధిలోని ఆదివాసీల పరిస్థితి దారుణంగా ఉంది. గూడేలకు కనీస వసతుల్లేవు. తాగేందుకు ఊట చెలిమల నుంచి వస్తున్న నీరే దిక్కు. గూడేలకు దూరంగా వైద్యశాలలు ఉండటం, సిబ్బంది సకాలంలో చేరుకునే పరిస్థితి లేకపోవడంతో వైద్యం అందని ద్రాక్షలా మారింది. రోడ్డు సౌకర్యాల్లేవు. రూ.400 కోట్లతో రోడ్లు వేస్తున్నామని మాత్రం ప్రభుత్వం నాలుగేళ్లుగా ప్రచారం చేసుకుంటోంది. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నిర్వీర్యమైంది.
బినామీల గుప్పెట్లో ఎస్సీల ఫలాలు
ఇక ఎస్సీ సంక్షేమ పథకాలు బినామీలు ఎగరేసుకుపోతున్నారు. ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం కార్ల కొనుగోలు పథకం ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఇవి ఎస్సీల పేరుతో పలువురు ఎమ్మెల్యేల బంధువులు, మంత్రుల బంధువుల వద్దకు చేరాయి. భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేసినట్లు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది. రూ.200 కోట్లతో 4333 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు 75శాతం సబ్సిడీపై ఇచ్చినట్లు ప్రకటించింది. కానీ, నాలుగేళ్లలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు.
- ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయానికి వస్తే మొత్తం రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ.800కోట్లు బకాయి ఉన్నారు.
- మైనార్టీలకు రూ.500కోట్లకు మించి ఖర్చుపెట్టిన దాఖలాల్లేవు. వైఎస్సార్ హయాంలో స్వర్ణ యుగాన్ని చవిచూసిన ఆ వర్గం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
- బీసీల్లో కుల వృత్తుల వారికి ఇస్తామన్న ఆదరణ పనిముట్లు ఇప్పటివరకూ ఇవ్వలేదు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు ఉంటే ఏటా రుణాలు ఇచ్చేందుకు 50వేల మందినే ఎంపిక చేస్తున్నారు. అయినా, అందులో 25వేల మందికి కూడా ఇవ్వడంలేదు.
- ఆదాయ పరిమితి పెట్టడంవల్ల చాలా కుటుంబాల వారు ‘పెళ్లి కానుక’ పథకానికి దూరమవుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన వధూవరులు 3,034 మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్క జంటకు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు.
- అలాగే, గిరిజనులకు ఉద్దేశించిన గిరిపుత్రిక కళ్యాణ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్క కొత్త జంటకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. ముస్లింల కోసం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం కూడా అలంకారప్రాయంగా మారింది. ఒక్కరికీ ఈ పథకం లబ్ధిచేకూర్చలేదు. అలాగే, బీసీలకు ప్రభుత్వం కొత్తగా రూ.35వేలు ఇస్తామని ప్రకటించింది. వీరి విషయంలోనూ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. కులాంతర వివాహాలు చేసుకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మాత్రమే అర్హులని ప్రభుత్వం మెలిక పెట్టింది.
- సంప్రదాయ చర్మకారుల జీవనోపాధి కోసం రూ.60 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు.
- మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి గత ఏడాది రూ.60 కోట్లు, ఈ సంవత్సరం రూ.100 కోట్లు కేటాయించారు. ఒక్కరికి కూడా సాయం అందించలేదు.
స్టడీ సర్కిళ్లు నిర్వీర్యం
ఇదిలా ఉంటే.. సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీ సర్కిళ్లు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ప్రభుత్వం వాటి గురించి ఆలోచించడం మానేసింది. దీంతో.. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ కోచింగ్‌కు దూరమవుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఉన్నా వాటిల్లో ఫ్యాకల్టీలు లేరు.
మొక్కుబడిగా ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ
ఈ పథకం కింద విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థి యూనివర్సిటీలో చేరి అడ్మిషన్ వివరాలు పంపిస్తే మొదటి విడతగా రూ.5లక్షలు విడుదల చేస్తారు. సంవత్సరం ముగిసే సమయంలో మరో రూ.5లక్షలు ఇస్తారు. కానీ, విదేశాల్లో పీజీ చదవాలంటే కనీసం రూ.30 లక్షలు ఖర్చవుతాయి. బ్యాంకుల నుంచి రూ.10 లక్షలు రుణం ఇప్పిస్తామని చెప్పిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు.
ఉన్నతి లేని ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ పథకం
ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్‌లో ఉచిత కోచింగ్‌కు సంబంధించి గత ఏడాది బీసీ, ఈబీసీలు కలిపి 1,240 మందికి, కాపులు 700 మందికి, ఎస్సీలు 700 మంది, ఎస్టీలు 300 మందిని ఎంపిక చేసి శిక్షణకు పంపించారు. ఒక్క బీసీలే సుమారు 50వేల మంది వరకు పరీక్ష రాశారు. మెరిట్ ప్రకారం ఎక్కువమందికి కోచింగ్ ఇప్పిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, శిక్షణ పొందిన వారికి నేటికి కూడా స్టైఫండ్ పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. దీంతో హాస్టళ్ల నిర్వాహకులు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
అక్కరకు రాని ‘చంద్రన్న బీమా’
ఇక ‘చంద్రన్న బీమా’ పథకం ద్వారా పేదలకు సకాలంలో సాయం అందటంలేదు. ఈ పథకానికి కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి సుమారు రూ.600కోట్లు దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి బీమా సొమ్ములో సగం కేంద్ర ప్రభుత్వ వాటా కాగా, మిగిలిన సగం రాష్ట్రానిది. కానీ, బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. తన వాటాను కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి తీసుకుని చెల్లిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, చిన్న పిల్లలకు తప్ప పెద్ద పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంలేదు. అలాగే, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు రూ.2,000లు పింఛన్ ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అదీ ఇవ్వడంలేదు.
ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం
రాష్ట్రంలో ఐదేళ్లలో 13 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నా పథకం మాత్రం ముందుకు సాగడంలేదు. బిల్లులు చెల్లించకపోవడమే కారణం. మరోవైపు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తోంది. 23వేల ఇళ్లు నిర్మించామని రాష్ట్రం అంటే.. కాదు, 7,749మాత్రమే అని కేంద్రం అంటోంది. దీంతో కేంద్రం బిల్లులు చెల్లించడంలేదు. అలాగే, మరో 20.97 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్రం మరో ఉత్తరం రాసింది. దీంతో.. మొదట 23 వేల ఇళ్లకు లెక్కలు చెప్పండి అంటూ కేంద్రం ప్రత్యుత్తరం ఇవ్వడంతో ఇద్దరి మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఇక అర్బన్ హౌసింగ్ పథకం కింద దాదాపు 6 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 4,934 ఇళ్లు మాత్రమే పూర్తిచేశారు.
2019 నాటికి 5 లక్షల గృహాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినా ఆ మేరకు నిర్మాణాలు మాత్రం చేపట్టడంలేదు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఇళ్ల కోసం 12 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నా వీరి గురించి పట్టించుకునే నాథుడేలేడు. చేనేత, మత్స్య కారులందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని.. మధ్య తరగతి వర్గాల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఇప్పటివరకు అతీగతీలేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత దానిని రూ.1.50 లక్షలకు కుదించి పేదలను మోసం చేశారు. ఇలా హామీల మీద హామీలు ఇవ్వడం మినహా పేదలకు మాత్రం సొంతింటి కల నెరవేర్చలేదు.
సంక్షేమ హాస్టళ్ల రద్దు
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ హాస్టళ్ల రద్దు పర్వం మొదలైంది. మెరుగైన విద్యను అందించేందుకు హాస్టళ్లను రద్దుచేసి ఆ స్థానాల్లో గురుకుల విద్యాలయాలు పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించి పేదలను మోసం చేసింది.
- మొత్తం ప్రీమెట్రిక్ కింద ఎస్సీల హాస్టళ్లు 1,450కు గాను ఇప్పటివరకు 648 రద్దయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 27,917 మంది.
- అలాగే, మొత్తం 197 ఎస్టీ హాస్టళ్లకుగాను అన్నీ రద్దయ్యాయి. వీటిలో 16,250మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
- బీసీ హాస్టళ్లదీ దాదాపు ఇదే పరిస్థితి. మొత్తం 897 హాస్టళ్లకుగాను 201 రద్దయ్యాయి. వీటిలో 13,000మంది విద్యనభ్యసిస్తున్నారు.
- ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఒక్క గురుకుల పాఠశాల కూడా నిర్మించలేదు. రద్దుచేసిన ఎస్టీ హాస్టళ్ల స్థానంలో 80 హాస్టల్ కన్వర్టెడ్ గురుకుల పాఠశాలలు, ఏజెన్సీలో 30 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఇవన్నీ రద్దుచేసిన పాత భవనాల్లోనే కొనసాగుతుండగా అక్కడి పరిస్థితులు పాత హాస్టళ్ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయి.
- కేంద్ర ప్రభుత్వం 14 ఏకల్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి భవన నిర్మాణాలకు నిధులిచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే విషయంలో తలెత్తిన వివాదం కోర్టుకు చేరడంతో ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కమీషన్ల విషయంలో తేడా రావడంతో ఈ భవనాలు ఆగిపోయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment