సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం సంక్షేమ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడానికి పలు పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆదాయ పరిమితికి లోబడి నూరు శాతం ఈ వర్గాల వారికి దేశంలోనే ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 25,86,392 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు.
వీరికి పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించి చదివించడం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఉచిత విద్యను అందించడం ప్రధాన ఉద్దేశం. వైఎస్సార్ విద్యోన్నతి పథకం కింద ఉచితంగా సివిల్స్‌కు కోచింగ్, ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా విదేశీ విద్య, స్కిల్ అప్‌గ్రేడేషన్ ద్వారా ఉచితంగా కొత్త కోర్స్‌లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, ప్రీమెట్రిక్ సంక్షేమ హాస్టళ్లు, సంక్షేమ పీజీ హాస్టళ్ల ద్వారా ఉచితంగా విద్యను ప్రభుత్వం అందిస్తోంది. దీని కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ విద్యకు రూ.4,980 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
దీనికి అదనంగా ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని రకాల సౌకర్యాలు పిల్లలకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కలిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ‘ఆహార బుట్ట’తో పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నారు. అమ్మఒడి పథకం కింద పిల్లలను స్కూళ్లకు పంపిస్తే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఉచితంగా అన్ని వర్గాల్లోని ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు పొందుతున్న పేద విద్యార్థులు (లక్షల్లో..)
ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.20 వేలు...
ప్రభుత్వం కొత్తగా మెయింటెనెన్స్ చార్జీలు (ఎంటీఎఫ్) కింద వసతి, భోజన సౌకర్యాల కోసం ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.20 వేలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. మెస్ చార్జీల కింద ఒక్కో పీజీ విద్యార్థికి నెలకు రూ.1,400లు ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి రూ.14,000 ఖర్చవుతున్నది. ఇవి కాకుండా మరో రూ.6 వేలు కలిపి సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తారు. ఇంత భారీ స్థాయిలో విద్యార్థుల వసతి సౌకర్యాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం దేశంలోనే మొదటిసారి ఏపీలో అమలవుతున్నది.
Comments
Please login to add a commentAdd a comment