లంచం ఇస్తేనే పనులు
► జన-మన’లో ఓ రైతు ఆవేదన
► కంగుతిన్న సిద్ధరామయ్య
► ప్రభుత్వ పథకాలపై నేరుగా
► లబ్ధిదారులతో సంవాదం
► మూడేళ్ల పాలనపై ప్రజలతో
► జీకేవీకేలో ప్రత్యేక సమావేశం
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టే వారికి ఎప్పుడు ముళ్లబాటే. అసమ్మతి ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అలాంటి పార్టీలో.. పూర్వాశ్రమంలో జనతాదళ్‌కు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా శుక్రవారం నాటికి మూడేళ్ల పాలనను సాఫీగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా మాట్లాడేందుకు నగరంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే)లోని సమావేశ భవనంలో శుక్రవారం ‘జన-మన’ పేరిట కార్యక్రమం నిర్వహించగా సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులకు సైతం ఓ లబ్ధిదారు నుంచి ఊహించని సమాధాన ం ఎదురైంది. చిత్రదుర్గకు చెందిన వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ....‘గ్రామాల్లో ఏ పని జరగాలన్నా అధికారులు పరోక్షంగా లంచం అడుగుతున్నారు. గంగాకళ్యాణలో భాగంగా రెండేళ్ల క్రితం బోర్వెల్ వేయించాను.
అందుకు సంబంధించిన బిల్లులన్నింటిని అధికారులకు అందజేసినప్పటికీ నాకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తం అందలేదు’ అంటూ వేదికపైనే ప్రశ్నించారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ వెంకటేష్‌ను పక్కకు తీసుకొని వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో సీఎం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అన్నభాగ్య, క్షీరభాగ్య, కృషి భాగ్య, మనస్విని తదితర పథకాల పనితీరును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఒక్కో జిల్లాకు పది మంది చొప్పున వివిధ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు. పథకాల అమలుకు సంబంధించిన వివరాలను, పాలనలో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి వీరి నుంచి సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందుకున్నారు.