‘నాయకత్వ మార్పు ఉండబోదు’
బెంగళూరు: బడ్జెట్ సమావేశాల అనంతరం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించనున్నారనే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆంజనేయ మాట్లాడారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేలందరి మద్దతు ఉందని అన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సిద్ధరామయ్యకు మద్దతు నిస్తోందని పేర్కొన్నారు. సిద్ధరామయ్య పూర్తి పదవీకాలం ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతారని స్పష్టం చేశారు. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి దళిత సంఘాలతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి ఆంజనేయతో పాటు దళిత సంఘాల నేతలు సిద్ధలింగయ్య, మారసంద్ర మునియప్ప, వెంకటస్వామి, మావళ్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.