సంక్షేమ భవన్లో విభజన లొల్లి!
హైదరాబాద్: అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పాటై వారం గడుస్తున్నా... సంక్షేమశాఖలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంక్షేమ కార్యాలయాల విభజన కూడా ఈ శాఖలో కనిపించడం లేదు. హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్లో రెండు ప్రాంతాల అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవ డడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
జూన్ 2 అపాయింటెడ్ డే నుంచి తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడంతో అంతకు ముందే ప్రభుత్వం సంక్షేమభవన్‌లోని ఆరు అంతస్తులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విభజించింది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండో అంతస్తులను తెలంగాణకు, మూడు నుంచి ఆరు అంతస్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ మేరకు సంక్షేమ భవన్లో విభజన వివరాలను కాగితాలపై ముద్రించి అన్ని అంతస్తులలో అతికించారు కూడా. అయితే వారం రోజులు గడిచినా... రెండు ప్రాంతాల అధికారులు, ఉద్యోగులు తమ చాంబర్లను ఖాళీ చేయలేదు.
దీంతో సంక్షేమభవన్‌కు వచ్చే ప్రజలు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం వచ్చే విద్యార్థులు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో 516 మంది ఉద్యోగులు ఉండగా, ప్రధాన కార్యాలయమైన సంక్షేమ భవన్లో 69 మంది ఉద్యోగులున్నారు. ఈ 69 మందిలో స్థానికత ఆధారంగా 23 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. మిగతా 46 మందిని ఆంధ్రప్రదేశ్ కు అప్పగించారు. మంజూరైన పోస్టుల ఆధారంగా జరిగిన ఈ విభజనలో సీమాంధ్రకు వెళ్లినవారిలో 13 మంది తెలంగాణ వారున్నారు.