సప్తపది
జిల్లాకు పెళ్లి కళ వచ్చింది. మార్గశిర మాసం ముహూర్తాలు మోసుకురావడంతో కల్యాణ వేదికలు ముస్తాబయ్యాయి. ఈనెల 6 నుంచి 18వ తేదీ వరకు ఏడు రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో పెళ్లి సందడి నెలకొంది. బాజాభజంత్రీలు, పురోహితులు, వేదిక అలంకరణ సామగ్రికి గిరాకీ పెరిగింది.
ఈనెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. 13, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు.
తిరుపతి గాంధీరోడ్డు: మూడు నెలల విరామం తర్వాత మార్గశిర మాసం వివాహ శుభ ఘడియలను మోసుకొచ్చింది. బుధవారం నుంచి పెళ్లిళ్లు ఆరంభమయ్యాయి. శుభకార్యం కోసం కల్యాణ మండపాలు సిద్ధమయ్యాయి. వస్త్ర దుకాణాలు, జ్యూవెలరీ షాపులు సందడిగా మారాయి. ముహూర్తాలు తక్కువగా ఉండటంతో ముందస్తుగానే మండల కేంద్రా లు, గ్రామీణ ప్రాంతాల్లో వివాహ వేడుకలకు సర్వం సిద్దమైంది.
వేదికల ముస్తాబు
వివాహ వేడుకలు నిర్వహించే కల్యాణ మండపాలు, పంక్షన్ హాళ్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఖరీదైన పెళ్లిళ్ల కోసం నిర్వాహకులు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మండపాల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్ చేస్తున్నారు. కొన్నిచోట్ల సెట్టింగ్లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆర్థిక స్తోమత కు అనుగుణంగా ఫంక్షన్ హాళ్లు రెడీ అవుతున్నాయి. జీవితంలో మరుపురాని రోజు కావడంతో ఎంత వ్యయమైనా వెనుకాడకుండా పెళ్లి చేయడానికి కొన్ని కుటుం బాలు సిద్ధమవుతున్నాయి.
అట్టహాసంగా ఏర్పాట్లు..
మారిన కాలంలో పెళ్లిళ్లు ఖరీదైపోయాయి. పెళ్లి చేయడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు. ముహూర్తాలు ఖరారు కావడంతో కల్యాణ మండపాల అద్దెను కూడా పెంచేశారు. ఇతర రోజులకన్నా సుమారు 20 నుంచి 25 శాతం అద్దెలు పెంచారు. పెళ్లికి రూ.15 వేలు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. ముఖ్య పట్టణాల్లో రూ.20 వేల వరకు కూడా వసూలు చేస్తున్నారు. క్యాటరింగ్, ఫోటో, వీడియోగ్రాఫర్లు కూడా తమదైన శైలిలో వసూలు చేస్తున్నారు. గతంలో కన్నా రూ.3 వేలు పెంచేశారు. పురోహితులు కూడా పరిస్థితిని బట్టి డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో పురోహితుడు ఏకకాలంలో రెండు, మూడు పెళ్లిళ్లు నిర్వహించడానికి ఒప్పం దం చేసుకున్నట్టు తెలిసింది. బంగారం ధరలు తగ్గడంతో ముందుగానే కొనేందుకు సిద్ధమవుతున్నారు. ముహూర్తాలు ఎక్కువ కావడంతో బంగారం ధరలు కూడా పుంజుకునే అవకాశం ఉంది.
శుభముహూర్తాలు ఏడు రోజులే ..
వివాహానికి ముహూర్తమే కొండంత బలం. ఈ ఏడాది భాద్రపద ఆశ్వయుజ కార్తీక మాసాల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో మార్గశిర మాసం పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది. ఈనెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. 13, 18 తేదీల్లో బల మైన ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు చెబుతున్నారు. 18 వ తేదీ దాటితే 2015 జనవరి 22వ తేదీ వరకు, అది కూడా లేదంటే మార్చి 15వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు లేవు.
బలమైన ముహూర్తాలున్నాయి
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ సారి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ ఆరో తేదీ నుంచి 18 తేదీ వరకు ఒక దఫా, జనవరి 22 నుంచి మార్చి 15 వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఉన్న వాటికే గణనీయంగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.
- ఎన్.శేషాచారి, అర్చకులు