breaking news
welfare schemes cut
-
సభకు రాకుంటే సంక్షేమ పథకాలు కట్
అనంతపురం: ‘సంక్షేమ పథకాలు తీసుకునేవారు సీఎం చంద్రబాబు సభకు హాజరు కావాలి. అలా వస్తేనే పథకాలు కొనసాగుతాయి..’ ఇది అనంతపురం జిల్లాలోని గ్రామాల్లో వేసిన చాటింపు. బుధవారం అనంతలో ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ పేరిట ప్రభుత్వం భారీ సభ తలపెట్టింది. దీనికి చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడచూసినా కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు, పోలీసుల హడావుడే..! ఐదు కిలోమీటర్ల దూరం నుంచే బస్సులు, భారీ వాహనాల మళ్లింపు, నగరంలో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి.సభ ఏర్పాట్ల పేరిట ఇబ్బంది పెడుతుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. బెంగళూరుకు వెళ్లే రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అనంతపురం నుంచి వడియంపేట–బుక్కరాయసముద్రం–నాయనపల్లి క్రాస్–నార్పల–ధర్మవరం–ఎన్ఎస్ గేట్ మీదుగా వాహనాలను మళ్లించడంతో 100–120 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. నార్పల నుంచి బత్తలపల్లికి వెళ్లే మార్గం సరిగా లేదు. వాహనాల రద్దీ పెరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కియా కంపెనీ ఉద్యోగులు అనంతపురం నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా.. చంద్రబాబు సభ పుణ్యమాని ఏకంగా 150 కిలోమీటర్ల దూరం చుట్టి వెళ్లాల్సి వస్తోంది. అనంతపురం శివారు కక్కలపల్లి టమాట మండీలకు నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మండీలకు సమీపాన జాతీయ రహదారి–44 పక్కనే సీఎం సభకు ఏర్పాట్లు చేశారు. దీంతో మంగళవారం రాత్రి నుంచే వాహన రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ టమాట వాహనాలను ఆపి పంపుతున్నారు. కక్కలపల్లి మండీ సమీపంలోకి వెళ్లడానికి వీల్లేకుండా చేశారు. టమాట వాహనాలను తిప్పి పంపుతుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇక నగర వీధులను ఫ్లెక్సీలతో నింపేశారు. సామాన్యులు రోడ్డుపై తిరగలేని పరిస్థితి కల్పించారు. దీనినితోడు నగరంలోనూ వాహన సంచారంపై పోలీసులు ఆంక్షలు విధించడం విమర్శలకు తావిస్తోంది. సభకు రాకుంటే పథకాల కోత! ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్సార్సీపీ చేపట్టిన ‘అన్నదాత పోరు’ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం. ఇక చంద్రబాబు సభలకు స్పందన లేకపోవడంతో జన సమీకరణకు సరికొత్త డ్రామాలకు తెరలేపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో చాటింపు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనాలి. దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారు. చంద్రబాబు సభలో పాల్గొన్నవారికే పథకాలు వస్తాయి’’ అంటూ దండోరా వేయడం విమర్శలకు తావిచ్చింది. పాఠశాలలకు సెలవు.. ఉపాధ్యాయుల ఆగ్రహం అనంతపురంలో సూపర్‌సిక్స్ సభ నేపథ్యంలో బుధవారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చంద్రబాబు సభకు పాఠశాలల బస్సులు తరలించిన నేపథ్యంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ పాఠశాలలకూ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. నేటి సెలవుకు బదులుగా రెండో శనివారం (ఈనెల 13న) అన్ని యాజమాన్యాల పాఠశాలలు పని చేయాల్సి ఉంటుందని డీఈఓలు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
పిల్లలను బడికి పంపకపోతే ‘సంక్షేమం’ కట్
సంగారెడ్డి మున్సిపాలిటీ/మెదక్, న్యూస్‌లైన్: తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోతే ఆ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పదో తరగతి అర్ధవార్షిక పరీక్ష ఫలితాల పై బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో ప్రధానోపాధ్యాయులతో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. త్రైమాసిక పరీక్ష ఫలితాలతో పోల్చితే అర్ధవార్షిక పరీక్షల ఫలితాల్లో గణనీయమైన వృద్ధి కన్పించిందన్నారు. అయితే విద్యార్థుల హాజరు శాతం పడిపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశా రు. జిల్లాలోని 556 పాఠశాలల్లో 31,100 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా అందులో 27,930మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. మిగతా 3,170 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరుశాతం చాలా తక్కువగా ఉన్నచోట అవసరమైతే తాను సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. హాజరుశాతాన్ని పెంచేం దుకు సంబంధిత సర్పంచ్ల సహకారం తీసుకోవాలని అవసరమైతే వారితో మాట్లాడతానని చెప్పారు. గత త్రైమాసిక పరీక్షల్లో జిల్లాలో కేవలం 38.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ప్రత్యేక కార్యాచరణ, క్విజ్ పోటీలు, ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత, సన్నిహిత అధికారుల నియామకం తదితర చర్యల వల్ల అర్ధవార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత 56.92 శాతానికి పెరిగిందన్నారు. జోగిపేట డివిజన్లో 57 శాతం, మెదక్ డివిజన్లో 54, సంగారెడ్డిలో 56, సిద్దిపేట డివిజన్లో 59 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. తగ్గిన రెడ్ జోన్ పాఠశాలలు.. త్రైమాసిక పరీక్షల్లో 226 పాఠశాలలు రెడ్‌జోన్‌లో ఉండగా, ఈసారి కేవలం 18 పాఠశాలలు మాత్రమే ఆ జోన్లో ఉం డటం సంతోషకరమని కలెక్టర్ తెలిపా రు. ఇప్పుడున్న 18 పాఠశాలలపై ప్ర త్యేక దృష్టి సారించాలని డీఈఓను ఆదేశించారు. ఈసారి ఫలితాలు అన్ని గ్రేడ్ల లో మెరుగ్గా ఉన్నాయన్నారు. త్రైమాసిక పరీక్షల్లో బ్లూ జోన్లో ఉన్న నల్లవాగు పాఠశాల ఈసారి అట్టడుగుస్థాయికి పడిపోవడం దారుణమన్నారు. వచ్చే మార్చి 14న జరగబోయే ప్రీఫైనల్ పరీక్షల్లో కనీ సం 80 శాతం, పబ్లిక్ పరీక్షల్లో వందశా తం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని హెచ్ఎంలకు సూచిం చారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా 40 రోజుల ప్రత్యేక కార్యాచరణను కలెక్టర్ ప్రారంభించారు. సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాం: డీఈఓ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరతను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఈఓ జి.రమేశ్ తెలిపారు. కలెక్టర్ కృషితో ఈసారి జిల్లాకు వంద అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ల పోస్టులు మంజూరైనట్టు చెప్పారు. వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశామన్నారు. 40 రోజుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తయారుచేశామని తెలిపారు. దానికి అనుగుణంగా పదో తరగతి విద్యార్థులకు బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.