సంక్షేమం వాయిదా
నల్లగొండ : జిల్లా సంక్షేమ శాఖల పథకాలను అమలు చేయడంలో వాయిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి పడుతున్న సమస్యలు..పథకాల అమలుకు మోకాలడ్డుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఖరారు చేసిన వార్షిక ప్రణాళిక..కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆమోదముద్ర వేసిన ఈ ఏడాది ప్రణాళిక...ఈ రెండు కూడా ప్రజలకు చేరకుండానే అర్థాంతరంగా ఆగిపోయాయి. ప్రతి ఏడాది బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వార్షిక ప్రణాళిక మే, జూన్‌లో ఖరారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ చివరి నాటికి గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేస్తారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితా జిల్లా కార్యాలయాలకు నవంబర్, డిసెంబర్లో వస్తుంది. అదే నెలల్లో అధికారులు అర్హులైన లబ్ధిదారుల పేరుమీద మంజూరు లేఖలు బ్యాంకులకు పంపుతారు. బ్యాంకర్లు మార్చిలోగా పథకాల గ్రౌండింగ్ పూర్తిచేస్తారు. ఇంకా ఏమైన మిగిలి ఉంటే వాటిని మరుసటి ఏడాదికి తీసుకుంటారు. ఈ విధానం అంతా కూడా రెండేళ్ల క్రితం వరకు సజావుగానే సాగింది. కానీ గడిచిన రెండు సంవత్సరాల వార్షిక ప్రణాళిక అమలే అస్తవ్యస్తంగా తయారైంది.
ఓట్లు దండుకునే ప్రయత్నంలో...
2012-13 సంవత్సరానికి గాను ఖరారు చేసిన వార్షిక ప్రణాళికను 2013 డిసెంబర్లో మార్చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం లబ్ధిపొందాలన్న ఉద్దేశంతో ఖరారు చేసిన ప్రణాళికను రద్దు చేశారు. కొత్తగా జీఓ నెం.101 జారీ చేశారు. దీని ప్రకారం పథకాల లబ్ధిదారుల వయోపరిమితి 21-45 ఏళ్లకు పెంచారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయకుండా...గ్రామాల్లో రాజకీయ నాయకుల భాగస్వామ్యంతో లబ్ధిదారులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని మెలిక పెట్టారు. నాటి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలన్న దురాశతో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్రణాళిక అమలు ఆలస్యమైంది. జనవరిలో కొత్త ప్లాన్ తెరమీదకు తీసుకొచ్చి, మూడు మాసాల్లో దానిని పూర్తిచేయాలని ఆదేశాలు ఉండటంతో అధికారులు ఆగమేఘాల మీద లబ్ధిదారులను అయినకాడికి గుర్తించారు. కానీ మున్సిపల్, సాధారణ ఎన్నికల కోడ్ మార్చి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో పథకాలను గ్రౌండింగ్ చేయకుండా ఆపేయాల్సి వచ్చింది.
పర్యవసానంగా 2012-13కు సంబంధించిన వార్షిక ప్రణాళిక ఎన్నికల తర్వాత అమలు చేద్దామంటే కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంచనాలు తారుమారయ్యాయి. దీంతో గతేడాది లబ్ధిదారులను గుర్తించి, మంజూరు ఇచ్చిన యూనిట్లు ప్రజలకు చేరకుండానే కాగితాలకే పరిమితయ్యాయి. పాతవాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ వచ్చింది. ఎన్నికల కోడ్ కంటే ముందు మంజూరు ఇచ్చి...బ్యాంకు ఖాతాలు తీసుకున్న వారి కి సబ్సిడీ విడుదల చేయాలని ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన 2012-13 సంవత్సరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి వివిధ పథకాల కింద 4, 768 మంది లబ్ధిదారులకు గాను కేవలం 2,625 మంది మాత్రమే బ్యాంకు ఖాతాలు తెరిచారు. మిగిలిన 2143 మందికి సంక్షేమ శాఖల నుంచి సాయం అందనట్లే. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఆ రెండు వేల మందికి పథకాలు గ్రౌండింగ్ చేసే అవకాశం లేదు.
కొత్త ప్లాన్‌కు ‘ఎమ్మెల్సీ’ ఎన్నికల బ్రేక్...
2014-15 వార్షిక ప్రణాళిక గతేడాది మేలో ఖరారు కావాల్సి ఉండగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల జోలికి పోలేదు. పథకాల విధానాల్లో మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో కాలాతీతం చేస్తూ వచ్చింది. బీసీ, ఎస్టీ శాఖల ప్రణాళిక ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వం ఆమోదించగా...ఎస్సీ ప్రణాళిక మూడు రోజుల క్రితం జిల్లాకు చేరింది. కొత్త ప్లానింగ్‌లో లబ్ధిదారుల వయోపరిమితి 21-55 ఏళ్లకు పెంచారు. దీంతోపాటు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లక్ష రూపాయలకు పెంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తో ముగియనుంది. ఇంత స్వల్ప వ్యవధిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయడం అధికారులకు కత్తిమీద సాములాంటింది.
వీటిన్నింటినీ పక్కకు పెడితే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మార్చి నెలాఖరు వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన పక్షంలో ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. అప్పటి వరకు సంక్షేమ పథకాలకు సంబంధించి గ్రామసభలు నిర్వహించడం గానీ, లబ్ధిదారుల ఎంపిక కానీ చేయకూడదు. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది వార్షిక ప్రణాళిక కూడా అటకెక్కినట్లే..! ఆర్థిక సంవత్సరంలో ఆరంభంలో ప్రారంభం కావాల్సిన సంక్షేమ పథకాల వార్షిక ప్రణాళిక ఆర్ధిక సంవత్సరం మూడు మాసాల్లో ముగస్తుందనంగా ఆమోదించి ఆచరణలోకి తీసుకరావడం అనేది పథకాలనే నమ్ముకున్న పేద, మధ్య తరగతి ప్రజలను వంచించడమే అవుతుంది..