well-being
-
సహృదయం.. సామరస్యం.. ద్వేష రాహిత్యం
ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మానవుల్లో ఉండాల్సినవి ఏవి? సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం ఇవి ప్రపంచ మానవుల్లో ఉండాల్సినవి. మానవులు క్షేమంగా ఉండాలంటే ఉండి తీరాల్సినవి ఇవే. అదేంటో మానవ చరిత్ర మొదలు అయినప్పటి నుంచీ ఇవి ఉండాల్సినంతగా, ఉండాల్సినట్టుగా ఉండడం లేదు. అందువల్లే మానవులకు శాంతి, భద్రతలు కరువైపోయాయి. ఈ దుస్థితి ఇకనైనా మారాలి; ఇకపైనైనా మనిషి వల్ల మనిషికి కలుగుతున్న ముప్పుకు ముగింపు రావాలి; మనకు సుస్థితి సమకూడాలి. అథర్వ వేదపాఠం అయిన సాంమనస్య సూక్తం ఎప్పటి నుంచో ‘సహృదయం సాంమనస్యం అవిద్వేషం కృణోమి వః’ అనీ, ‘అన్యో అన్యమభి హర్యత వత్సం జాతమివాఘ్న్యా’ అనీ ఘోషిస్తూనే లేదా చాటిస్తూనే ఉంది. అంటే సహృదయులుగానూ, సామరస్యంతోనూ లేదా ఏకమనస్కులుగానూ, ద్వేషరహితులుగానూ మిమ్మల్ని రూపొందిస్తాను అనీ, అపుడే పుట్టిన దూడను తల్లి ఆవు ప్రేమించేట్టుగా పరస్పరం ప్రేమించుకోవాలి అనీ అర్థం. ఈ మాటల్ని మనం అర్థం చేసుకోనేలేదు. అందుకే మనలో అపాయం అతిగా వ్యాపిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని మనం వెనువెంటనే పరిష్కరించుకోవాలి. ప్రపంచం, దేశం, సమాజం వీటికి తొలిదశ ఇల్లు. ఒక ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః‘ అనీ, ‘జాయా పత్యే మధుమతీమ్ వాచమ్ వదతు శాన్తివామ్‘ అనీ చెబుతోంది. అంటే ఒక కొడుకు తన తండ్రిని అనుసరించే వాడుగానూ, తన తల్లితో సామరస్యంతోనూ ఉండాలి, భార్య భర్తతో మధురమైనదై ప్రశాంతతను ఇచ్చే మాటల్ని చెప్పనీ అని అర్థం. ఒకరిని ఒకరు వెన్నంటి ఉండడం, ప్రశాంతత, హితవచనం ఇవి ఇంటి నుంచే మొదలు అవ్వాలి. ద్వేషరాహిత్యం అన్నది కూడా ఇంటి నుంచే రావాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘మా భ్రాతా భ్రాతరం దదిక్షన్మా స్వసారముత స్వసా’ అనీ, సమ్యఞ్చః సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా’ అనీ చెబుతోంది. అంటే సోదరీ సోదరులు ద్వేషించుకోకూడదు, కలిసికట్టుగా పనిచెయ్యండి, అందరూ శుభం కలిగించే మాటల్ని పలకండి అని అర్థం. అభిప్రాయ భేదాలతో ఒక ఇంట్లోని సభ్యులు పరస్పరం ద్వేషించుకుంటూ విడిపోవడం కాదు ఉమ్మడిగా ఉండడానికి వాళ్ల మధ్య అవగాహన ఉండాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘యేన దేవా న వియన్తి నో చ విద్విషతే మిథః’ అనీ,‘తత్ కృణ్మో బ్రహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః’ అనీ చెబుతోంది. అంటే దేనివల్ల దేవతలు విడిపోరో, ద్వేషించుకోరో అవగాహన అన్న ఆ ఉన్నతమైన భావన ఇంట్లోని సభ్యుల్లో ఉండాలి అని అర్థం. సంజ్ఞానం లేదా అవగాహన మనకు ఉండి తీరాలి. చిన్నవాళ్లు పెద్దలను వెన్నంటి వెళుతున్నట్టుగా ఒకరికి ఒకరై ఏకమనస్కులుగా, సామూహిక ఆరాధన చేసేవాళ్లుగా, పరస్పరం ప్రీతితో మాట్లాడుకునేవాళ్లుగా కలిసి మెలిసి బతకండి అని సూచిస్తూ ‘జాయస్వన్తశ్చిత్తినో మా వి యౌష్ట సమారాధయన్తః సధురాశ్చరన్తః’ అని సాంమనస్య సూక్తం మనకు చెబుతోంది. అంతేకాదు ప్రేమ అనే తాడుతో అందరూ కట్టబడాలి అన్న సూచ్య అర్థం వచ్చేట్టుగా ‘సమానే యోక్త్రే సహ వో యునజ్మి’ అనీ, ‘దేవా ఇవామృతమ్ రక్షమాణాః సాయం ప్రాతః సౌమనసో వో అస్తు‘ అంటూ దేవతలు అమృతాన్ని రక్షిస్తున్నట్టుగా ఉదయ, సాయం కాలాల్లో సద్భావనల్ని రక్షించండి అనీ చెబుతోంది సాంమనస్య సూక్తం. సాంమనస్య సూక్తం చేసిన ఈ సూచనను అందుకుని సద్భావనల్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి; ఆపై మనం రాణించాలి. ‘భారతీయ వైదిక సాహిత్యం సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం వీటితో మానవులు మెలగాలని ప్రగాఢంగా ప్రవచించింది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అది జరగకపోతే మన జీవితాలు అనర్థ దాయకమూ, అల్లకల్లోలమూ అయిపోతాయి‘. – రోచిష్మాన్ -
నీ ఆకలి, నీ నిద్ర నీదే కదా...మరి..!!!
నీవు ఎదగలేకుండా పోవడానికి కారణం ఎవరు ? నీకు సలహాలిచ్చేవారికోసం, నీకు సహాయపడేవారికోసం చూస్తున్నావా? నీకు బంధువులు లేరా? వాళ్ళు నిన్ను పట్టించుకోవడంలేదా? నీకు స్నేహితులు, శ్రేయోభిలాషులెవరూ లేరా? వారు నీకు మార్గదర్శనం చేయడం లేదా? లేక... నీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా? వాళ్లు నిన్ను ముందుకు పోనీయడం లేదా? అంటే ఎవరో రావాలనీ, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా నడిపించాలనీ, నీ ప్రతి కష్టంలో వారు నీకు తోడుగా నిలబడి దిశానిర్దేశం చేయాలని నీవు కోరుకుంటున్నావని అర్థం... దీనికి జగద్గురువయిన కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడో చూడండి... ‘‘ఉద్ధరేద్ ఆత్మనాత్మానమ్ నాత్మానమ్ అవసాదయేత్, ఆత్మైవ హై ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపుర్ ఆత్మనః’’ – అంటే నీకు నీవే బంధువువు, నీకు నీవే స్నేహితుడివి, నీకు నీవే శత్రువివి. నీకు ఆకలివేస్తే నీవే తినాలి, నీకు నిద్రవస్తే నీవే నిద్ర పోవాలి, నీకు దాహం వేస్తే నీవే నీళ్లు తాగాలి...అలాగే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు సమస్యలు ఎదురయినప్పుడు ఎవరో వస్తారని, నిన్ను కటాక్షిస్తారని, నిన్ను ఉద్ధరిస్తారని ఎదురు చూస్తూ కూచోవద్దు. బంధువులు, స్నేహితులు, శత్రువులు బయట లేరు... నీలోనే ఉన్నారు. నీవు వారిని గుర్తిస్తే... నీకు ఇక ఏ చింతా ఉండదు. నీ నిద్ర నీవు పోయినట్లుగానే, నీ ఆకలి నీవు తీర్చుకున్నట్లుగానే... నీ కష్టాన్ని కూడా నీవే తీర్చుకుంటావు. భగవంతుడు మనకు కొన్ని అద్భుతమయినవి ఇచ్చాడు. భువనం.. ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. నీ జీవితం వర్ధిల్లడానికి ప్రకృతిని ఇచ్చాడు. నీకు ఆహ్లాదమయినవి చూసి సంతోషించడానికి కళ్ళు ఇచ్చాడు.. నీకు ఇష్టమయినవి వినడానికి చెవులిచ్చాడు. తాకి అనుభూతి చెందడానికి చర్మానికి స్పర్శనిచ్చాడు. వాసనలు చూడడానికి ముక్కు ఇచ్చాడు... ఇలా చాలా ఇచ్చాడు... ఇవన్నీ నీకోసం, నీవు అనుభవించడానికే ఇచ్చాడు... అయితే ఇవన్నీ ధర్మచట్రంలో ఇమిడేటట్టు చూసుకోమన్నాడు... అంతే.. అదే చేసెయ్... ఇవన్నీ వదిలేసి మనసు పక్కచూపులు చూస్తున్నదనీ, ఎటో లాగుతున్నదనీ విచ్చలవిడిగా పోతే ... నీలో ఉన్న శత్రువును... నీవే ఉత్సాహపరిస్తే... నీ పతనానికి నీవే దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు అవుతుంది. పిల్లలను కూర్చోబెట్టుకుని వారికి మంచీ చెడూ ఎలా చెబుతుంటావో... నీ మనసుకు కూడా ప్రతిరోజూ, ప్రతి క్షణం అలా చెబుతూ ఉండు... అప్పడది నీకు ఆత్మబంధువుగా మారుతుంది. నీ శ్రేయస్సు కోరే నీ స్నేహితుడిగా, నీ శ్రేయోభిలాషిగా నీకు మార్గదర్శనం చేస్తుంది. నీ కంటికి కనురెప్ప ఉంది. అది నీ కంటిని ఎలా కాపాడుతుంటుందో నీ మనసును అనుక్షణం నీవు అలా కాపాడుతుండాలి. అదే నిన్ను నీవు ఉద్ధరించుకోవడం– అని పరమాత్మ గీతాబోధ చేసాడు. ఇంతకన్నా చెప్పడానికి ఎవరికయినా ఏముంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అణువుకన్నా సూక్ష్మం ఆత్మవిద్య!
నచికేతోపనిషత్తు యముడు ఇస్తానన్న మూడు వరాలలో రెండిటిని నచికేతుడు అడిగాడు. ఒకటి ఇహానికి, మానవ సంబంధాలకూ చెందినది. రెండవది స్వర్గానికి చేర్చే అగ్ని ఉపాసన. మూడవది మరణం తరువాత ఆత్మస్థితిని తెలుసుకోవటం. మూడవ వరం నచికేతుడు అడిగినట్లు ఇవ్వటానికి యముడు వెంటనే ఒప్పుకోలేదు. అతని మనస్సు మార్చటానికి ప్రయత్నించాడు. నచికేతుని శ్రద్ధను పరీక్షించి ఆత్మవిద్యను చెప్పనారంభించాడు. నచికేతా! శ్రేయస్సు, ప్రేయస్సు అని రెండు ఉన్నాయి. వాటిలో శ్రేయస్సు శుభప్రదం. ప్రేయస్సు ఇహలోక సుఖాలకు మాత్రమే పరిమితం. ఈ రెండూ జీవులకు బాధకారణాలే. స్వర్గాది సుఖాలు ఇచ్చే శ్రేయస్సు కాక కేవలం భౌతికసుఖాలనిచ్చే ప్రేయస్సును కోరుకునేవాడు హీనుడు. శ్రే యస్సు, ప్రేయస్సు రెండూ మానవునికి ప్రయత్నిస్తే దొరికే వే. వాటిలో ఏది శాశ్వతానంద దాయకమో జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారు. వారిని ధీరులు అంటారు. అశాశ్వతమైన ప్రేయస్సును కోరుకునేవారిని మందబుద్ధులు అంటారు. నాయనా! నువ్వు బుద్ధిమంతుడివి. తాత్కాలిక సుఖాలను ఇచ్చే కోరికలను వదులుకున్నావు. అజ్ఞానులైన మానవులు చాలామంది సంపదకోసం వెంపర్లాడుతూ అగాథంలో పడిపోతున్నారు. విద్య, అవిద్య అనే రెండు దారులు ఉన్నాయి. రెండూ వేరువేరు గమ్యాలకు చేరుస్తాయి. వాటి మధ్య చాలా దూరం ఉంది. నచికేతా! నువ్వు విద్యామార్గాన్నే కోరుకున్నావు. ఎటువంటి ఐహికభోగాలకూ, ప్రలోభాలకూ నువ్వు లొంగలేదు. అవిద్యామార్గంలో వెళ్లే మూర్ఖులు తామే ధీరులమనీ, పండితులమనీ అనుకుంటారు. గుడ్డివాడితో నడిచే గుడ్డివాడిలా గోతిలో పడుతూ ఉంటారు. అజ్ఞానానికి, ధనమదంతో కళ్లు నెత్తికి ఎక్కినవారికి మోక్షమార్గం కనిపించదు. ఈలోకమే ఉంది. పరలోకం లేదు అనుకుంటూ పదేపదే నా చేతికి చిక్కుతూ ఉంటాడు. నచికేతా! ఆత్మతత్వం అందరికీ తెలియదు. వినటం సాధ్యం కాదు. విన్నవారు అయినా సమగ్రంగా దానిని గ్రహించలేరు. అంతటి ఆత్మజ్ఞానాన్ని బోధించే ఆచార్యుడు దొరకటం కూడా ఆశ్చర్యమే. అటువంటి గురువు చెప్పిన దానిని ఆమూలాగ్రం గ్రహించగల శిష్యుడు దొరకటమూ అద్భుతమే. అల్పజ్ఞానంతో బోధించేవారి ద్వారా ఆత్మతత్త్వం బోధపడదు. ఆత్మజ్ఞాని అయిన గురువు ద్వారా మాత్రమే అది తెలుస్తుంది. ఆత్మవిద్య అణువుకన్నా సూక్ష్మం. అన్ని తర్కాలకూ అతీతం. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న ఆత్మజ్ఞానం తర్కంతో, వాదోపవాదాలతో తెలియదు. సుజ్ఞాని అయిన గురువునుండి అది లభిస్తుంది. తెలుసుకోదలచిన జిజ్ఞాసువు సత్యనిష్ఠ, స్థిరచిత్తం కలిగినవాడు అయి ఉండాలి. నువ్వు అటువంటివాడివి. నాకు అరుదుగా దొరికావు. ‘‘గురువర్యా! యమధర్మరాజా! అశాశ్వతమూ అధ్రువమూ అయిన సామగ్రితో శాశ్వతమైన వస్తువును పొందటం అసాధ్యం. నిధులు అనిత్యం. అయినప్పటికీ అశాశ్వతమైన భౌతికమైన పదార్థాలతో శాశ్వతమైన, నిత్యమైన స్వర్గాన్ని పొందాను’’ నచికేతా! మానవులు భౌతికమైన కోరికలు తీర్చుకోవాలని చూస్తారు. యజ్ఞయాగాది కర్మలతో అనంతమైన, అభయప్రదమైన పారలౌకిక ప్రయోజనాన్ని పొందుతారు. నువ్వు వీటన్నింటిని దాటివచ్చావు. ధీరుడివై దృఢచిత్తంతో ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచావు. అంత తేలికగా అంతుపట్టనిది, గూఢమైనది, గుండె గుహలో దాగి ఉన్నదీ అతిప్రాచీనమైనది, నవీన మైనది అయిన ఆత్మను అధ్యాత్మయోగం ద్వారా తెలుసుకొని ఏకాగ్రతతో ధ్యానించి దర్శించగలిగిన ధీరునికి హర్షశోకాలకు సుఖదుఃఖాలకు అతీతమైన స్థితి లభిస్తుంది. ధర్మప్రధానమైన ఆత్మతత్వాన్ని విన్న మానవుడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. నాయనా! ఈ జ్ఞానసౌధం తలుపులు నీకోసం తెరచి ఉన్నాయి. ‘‘సమవర్తీ! ధర్మాధర్మాలకు, కృతాకృతాలకు, భూతభవిష్యత్తులకు సంబంధం లేకుండా నీవు దర్శించిన ఆత్మతత్వాన్ని నాకు బోధించు’’ ‘‘నచికేతా! అన్ని వేదాలు, తపస్సులు, ఏ పరమపదాన్ని చెబుతున్నాయో, దేనికోసం సాధకులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారో, దాన్ని గురించి సంగ్రహంగా చెబుతాను విను. అదే ఓంకారం. ప్రణవాక్షరమే పరబ్రహ్మం. అదే ఉత్తమం. ప్రణవోపాసన చేసినవారి కోరికలు ఏవైనా సిద్ధిస్తాయి. ఓంకారమే శ్రేష్ఠమైన ఆలంబనం. దీన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మలోకంలో స్థిరనివాసం ఏర్పరచుకుంటాడు. ఆత్మకు చావుపుట్టుకలు లేవు. ఎటువంటి మార్పులకూ లోనుకాదు. శరీరం పోయినప్పటికీ ఆత్మ నశించదు. జన్మించదు. అది శాశ్వతం. ఆద్యంత రహితం. చంపినవాడు హంతకుడనీ, చచ్చినవాడు హతుడనీ ఆత్మజ్ఞానం లేనివాడనీ అనుకుంటారు. ఆత్మ చంపదు. చావదు. అణువుకన్నా సూక్ష్మమూ, బ్రహ్మాండం కన్నా పెద్దదీ అయిన ఆత్మ ప్రాణుల్లో దాగి ఉంది. నిష్కాముడూ, సుఖదుఃఖాలకు అతీతుడు అయిన సాధకుడు మంచిమార్గంలో నడిచే ఇంద్రియాలు, మనసు సహాయంతో మహిమాన్వితమైన ఆత్మను దర్శించుకోగలుగుతాడు. కదలకుండా కూర్చునే ఎక్కడికైనా ప్రయాణిస్తాడు. నిద్రలోనే ఎక్కడికైనా వెళతాడు. తేజోమయమైన ఆత్మ తత్త్వాన్ని ఇటువంటి వాడు తప్ప మరొకడు తెలుసుకోలేడు’’. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్