చిదంబరం భార్యకు బిగుసుకుంటున్న శారదా స్కాం
పశ్చిమబెంగాల్‌తో పాటు దేశాన్నే కుదిపేసిన శారద చిట్‌ఫండ్ స్కాం ఉచ్చులో మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం భార్య నళిని చిదంబరం బిగుసుకుపోతున్నారు. ఈ స్కాం కేసులో మనీ లాండరింగ్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని నళిని చిదంబరాన్ని ఈడీ ఆదేశించింది. సెప్టెంబర్ మొదటివారంలో కోల్‌కత్తాలోని విచారణ టీమ్ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీచేసింది. శారదా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మతంగ్ సింగ్ సతీమణి మనోరంజన్ సింగ్‌కు నళిని చిదంబరం న్యాయవాదిగా నిర్వర్తించారు.
ఆమె అభ్యర్థన మేరకు శారదా కేసులో నళిని వాదనలు వినిపించారు. అయితే దీనికోసం ఆమె రూ.1.26 కోట్ల ఫీజును చిట్‌ఫండ్ నుంచి పొందారని వాదనలు వినిపించాయి. దీనిపై ఆదారాలు సేకరించిన సీబీఐ, చిట్‌ఫండ్ యాజమాన్యం, మనోరంజన్సింగ్లతో పాటు, నళినీని చార్జ్‌షీట్‌లో చేర్చింది. ప్రస్తుతం శారదా కంపెనీ అకౌంట్ల నుంచి ఆమెకు నగదు బదిలీ ఎలా జరిగిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. గతంలోనే ఈ విషయంలో సీబీఐ, ఈడీ నుంచి నళిని విచారణ ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుతం కొత్త సాక్ష్యాలతో నళినీ విచారణను ఎదుర్కోబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.