పశ్చిమబెంగాల్లో ర్యాగింగ్.. నలుగురి అరెస్టు
పశ్చిమబెంగాల్లో విద్యార్థిని ర్యాగింగ్ వల్ల మరణించిన సంఘటన బయటపడి, దాంతో తీవ్రమైన అల్లర్లు జరిగినా.. ఇంకా అక్కడ ర్యాగింగ్ సంఘటనలు ఆగలేదు. హుగ్లీ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్ ఘటన జరగడంతో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. సెరాంపూర్లోని ప్రభుత్వ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి యూజీసీకి ఫిర్యాదుచేయడంతో వీరు నలుగురిని అరెస్టు చేశారు.
తాను కాలేజి హాస్టల్లో సెప్టెంబర్ 1న చేరగా, అప్పటినుంచి ఈ నలుగురు సీనియర్లు మద్యం మత్తులో తనను పదే పదే శారీరకంగా, మానసికంగా వేధించారని రెండో సంవత్సరం విద్యార్థి ఫిర్యాదు చేశాడు. దాంతో అతడు హాస్టల్ నుంచి పారిపోయి, యూజీసీకి ఫిర్యాదు చేశాడు. అనంతరం విచారణ జరిపి, నలుగురు సీనియర్లు తప్పు చేసినట్లు తేల్చి పోలీసులకు తెలిపారు. పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.