బెంగాల్ ఐఏఎస్ అధికారికి సీఐడీ కస్టడీ
సిలిగురి: పశ్చిమబెంగాల్లో ఐఏఎస్ అధికారి కిరణ్ కుమార్‌ను నాలుగు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. సిలిగురి-జల్పాయ్గురి అభివృద్ధి మండలి (ఎస్జేడీఏ)లో వంద కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన ప్రమేయమున్నట్టు ఆరోపణలు రావడంతో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
గురువారం కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి సిలిగురి కోర్టులో హాజరుపరచగా సీఐడీ కస్టడీకి అప్పగించింది. కిరణ్ కుమార్ ప్రస్తుతం పశ్చమబెంగాల్ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. 2005 బ్యాచ్‌కు చెందిన కిరణ్ కుమార్ ఎస్జేడీఏ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్జేడీఏ సీఈవోగా పనిచేసినపుడు ఆయన అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి.