బీజేపీ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో శాంతియుత పరిస్థితులు ఎంత బలహీనంగా ఉన్నాయో, మహిళలకు ఏపాటి రక్షణ ఉందో తెలియజేసే ఉద్దేశంతో అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారో, కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారో వారంతా తమ ఇళ్లలోని మహిళలను బెంగాల్‌కు పంపించాలని, అలా పంపిస్తే కచ్చితంగా వారిపై 15 రోజుల్లో అత్యాచారం జరుగుతుందని, ఈ విషయం తాను సవాల్ చేస్తున్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారికి ఏ హానీ జరగకుండా 15 రోజులు జీవించగలిగితే అది చాలా గొప్ప విషయం అని, ఒక వేళ నిజంగానే తాను చెప్పినట్లుగా 15 రోజుల్లో వారిపై ఎలాంటి లైంగికదాడి జరగకుండా సురక్షితంగా బయటపడితే తాను అన్న వ్యాఖ్యలను కచ్చితంగా వెనక్కు తీసుకుంటానని కూడా సవాల్ చేశారు.
'బెంగాల్‌లోని ప్రభుత్వానికి ఎవరు మద్దతిస్తున్నారో అది టీఎంసీ నేతలు కావొచ్చు, కాంగ్రెస్ నేతలు కావొచ్చు. నేను వారికి సవాల్ విసురుతున్నాను.. వాళ్లు తమ కూతుర్లను, వదినలను, భార్యలను బెంగాల్‌కు పంపించండి.. వారు మమతా బెనర్జీ నుంచి ఎలాంటి సహాయం పొందకుండా ఉండి లైంగిక దాడికి గురవ్వకుండా 15 రోజులు ఉండగలిగితే అప్పుడు నాకు చెప్పండి. కచ్చితంగా నా మాటలు వెనక్కు తీసుకుంటాను. బెంగాల్లో ఏ ప్రభుత్వాధికారి పనిచేయడం లేదు. గుర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో బెంగాల్ హింసకు కేంద్రంగా మారింది. డార్జిలింగ్‌లో అశాంతి పెరిగింది' అంటూ ఆమె మీడియాకు చెప్పారు.