పుష్కర పండుగ
మూడు చోట్ల గోదావరి పుష్కరాలు
తొలిసారిగా మల్లూరులో ఘాట్
రామన్నగూడెంలో మరో స్నానఘట్టం
గోదావరి తీరంలోని ఆలయూల సుందరీకరణ
రూ.8 కోట్లతో ప్రణాళిక రూపకల్పన
నేడు ప్రభుత్వానికి నివేదిక
హన్మకొండ : గోదావరి తీరంలో పెద్ద పండుగ జరగనుంది. మేడారం మహా జాతరను తలపించేలా... ఏజెన్సీ ప్రాంతం మరోసారి భక్తులతో కిటకిటలాడనుంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను జిల్లాలో మూడు ప్రాంతాల్లో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మైనర్, మేజర్ ఇరిగేషన్, పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పుష్కర పండుగకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కసరత్తు మొదలుపెట్టారు. పుష్కర ప్రాంతాల్లో స్నానఘట్టాల నిర్మాణాలకు దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్లాన్ వేశారు.
ఈసారి మొత్తం రూ. 8 కోట్ల వ్యయంతో పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రధాన ఆలయాలతోపాటు గోదావరి తీరం వెంట ఉన్న శివాలయాలన్నింటినీ విద్యుత్ కాంతుల్లో సుందరంగా అలంకరించనున్నారు. ప్రధానంగా గోదావరి తీరం వెంట ఉన్న ఏటూరునాగారం, మల్లూరు ప్రాంతాల్లోని దేవాలయాలకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించే పనిలో అధికారులు నిమగ్నమయ్యూరు.
మల్లూరులో తొలిసారి
మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద పుష్కరాలను తొలిసారిగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మల్లూరుకు రెండు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లే గోదావరి తీరం వెంట సుమారు 700 మీటర్ల పరిధిలో స్నానఘట్టాల నిర్మాణం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
రామన్నగూడెంలో మరో స్నానఘట్టం
గోదావరి పుష్కరాల్లో భాగంగా 12 ఏళ్ల క్రితం ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద ఒక స్నానఘట్టాన్ని నిర్మించారు. వచ్చే ఏడు రామన్నగూడెం వద్ద మరొక స్నానఘటాన్ని నిర్మించాలని అధికారులు ప్రతిపాదనల్లో పొందుపరిచారు. రామన్నగూడెం వద్ద గోదావరి తీరానికి కొంత దూరంలో 600 మీటర్ల మేర స్నానఘట్టం నిర్మించనున్నారు.
ఏటూరునాగారం సంగంపాయ వద్ద...
గోదావరి వరద ఏటూరునాగారం శివారు సంగంపాయ మీదుగా ప్రవహిస్తోంది. ఇక్కడ కూడా తొలిసారిగా పుష్కర పండుగను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు సంగంపాయ వద్ద స్నానఘట్టంతోపాటు ఏటూరునాగారంలోని రామలింగేశ్వరస్వామి ఆలయం, సంగంపాయ వద్ద ఉన్న మల్లిఖార్జున స్వామి ఆలయాల్లో పుష్కర పూజలు నిర్వహించే విధంగా ప్రణాళికకు రూపకల్పన చేశారు. వచ్చే ఏడు నిర్వహించే గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రెండు ఆలయాలను ముస్తాబు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నేడు ప్రభుత్వానికి ప్రతిపాదనల అందజేత
గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లపై ప్రతిపాదనలు పంపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. దీంతో దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం అధికారులతోపాటు నీటిపారుదల, పంచాయతీ రాజ్ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పుష్కర స్నానాలకు సంబంధించి స్నానఘట్టాల నిర్మాణం... దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయాల ముస్తాబు, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు జరగనున్నారుు.
మొత్తం రూ. 8 కోట్లతో జిల్లాలో గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు ప్రాథమిక ప్రతిపాదనల్లో అధికారులు పేర్కొన్నారు. దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం నుంచి ప్రతిపాదనలను శుక్రవారం ప్రభుత్వానికి పంపించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు.