అమ్మో సైకో !
మెట్ట ప్రాంతానికీ విస్తరించిన ఇంజెక్షన్ల పరంపర
దాడి చేస్తున్నది ఒకడా లేక ముఠానా :
14కు పెరిగిన బాధితుల సంఖ్య
పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్న సైకో ఆగడాలు
హై అలర్ట్ ప్రకటించినా యథావిధిగా ఇంజెక్షన్ దాడులు
భీమవరం/పెనుగొండ రూరల్/పోడూరు/నల్లజర్ల రూరల్ : ‘అమ్మో.. వాడే సైకో అనుకుంటా. మొహానికి ముసుగేసుకుని బైక్‌పై వేగంగా వెళ్తూ కనిపించాడు. వాణ్ణి చూడగానే కాళ్లు చేతులు ఆడలేదనుకో. ఏ మూలనుంచి వచ్చి ఇంజెక్షన్ పొడుస్తాడో అని భయమేసింది’ జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. మొహానికి ముసుగువేసుకుని వెళ్లే వ్యక్తి ఎవరు కనిపించినా.. అతడే సైకో ఏమో అనే అనుమానంతో చూసున్నారు. ఐదు రోజులుగా పోలీసులకు కంటిమీద నిద్రలేకుండా చేస్తూ.. మహిళలు, విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో ఆగడాలు బుధవారం కూడా కొనసాగాయి. తాజాగా సైకో ఇంజెక్షన్ల బారినపడిన ఆరుగురు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ ఘటనలకు పాల్పడుతున్నది ఒక్కడేనా.. లేక ఇది ఓ ముఠా పనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం ఆరుగురు ఆసుపత్రి పాలు
శనివారం ఉండి మండలం యండగండిలో ఇద్దరు విద్యార్థినులపై ఇంజెక్షన్లతో పంజా విసిరిన సైకో వరుసగా ఘటనలకు పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. అటు పోలీసు యంత్రాం గానికి సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. తాజాగా బుధవారం ఉదయం 6 గంటలకు పెనుగొండ మండలం వడలి రోడ్డులో చెరుకువాడ వద్ద వాకిలి ఊడుస్తున్న గృహిణి కొమ్మిరెడ్డి హేమలత (27)కు ఇంజెక్షన్ ఇచ్చి పరారైన సైకో అనంతరం మండలంలో సిద్ధాంతం గ్రామానికి చెందిన మాడుగు కృష్ణకుమారి (16) అనే బాలిక మరుగుదొడ్డికి వెళ్తుండగా మోటార్ బైక్‌పై వెళ్లి ఇంజెక్షన్ ఇచ్చి పారిపోయాడు.
ఆ తరువాత పోడూరు మండలం కవిటంలో కళాశాలకు సైకిల్‌పై వెళ్తున్న ఇంటర్ విద్యార్థిని కొవ్వూరి తేజశ్రీ (17)కు ఇంజెక్షన్ ఇచ్చాడు. విద్యార్థిని పెద్దగా కేకలు పెట్టడంతో స్థానికులంతా గుమిడూడి పట్టుకునే ప్రయత్నం చేసేలోపే జారుకున్నాడు. ఆ తరువాత వీరవాస రం మండలం కొణితివాడ గ్రామ శివారు బుధారాయుడుచెరువు వద్ద సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న ఇంటర్ విద్యార్థిని కేతా విజయకు వెనుక నుంచి ఇంజెక్షన్‌తో పొడిచి పారిపోయాడు.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నలజర్లలో బహిర్భూమికి వెళ్లి వస్తున్న గంటా చంటి (21) అనే గృహిణికి ఇవ్వటం ద్వారా మెట్ట ప్రాంతంలోనూ పంజా విసిరాడు. వీరంతా సమీపంలోని ఆసుపత్రుల్లో చేరారు. ఇదిలావుండగా, బుధవారం దాడికి గురైన బాధితులతో కలిపి మంగళవారం ఉద యం వీరవాసరం గ్రామానికి చెందిన కూనపరెడ్డి అనంతలక్ష్మి తనకూ సైకో ఇంజెక్షన్ చేశాడంటూ బుధవారం వీరవాసరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో ఇప్పటివరకూ సైకో బారినపడిన వారి సంఖ్య 14కు చేరుకుంది.
హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
జిల్లాలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు నరసాపురం డీఎస్పీ పి.సౌమ్యలత విలేకరులకు తెలిపారు. అతడు ప్రణాళిక ప్రకారం ఇంజెక్షన్లు దాడులకు పాల్పడుతున్నాడని ఆమె పేర్కొన్నారు. ఇంజెక్షన్ చేసిన అనంతరం ఒకచోట నుంచి మరో చోటకు పారిపోతున్నాడని అభిప్రాయపడ్డారు. సైకో తన మకాం డెల్టా నుంచి మెట్ట ప్రాంతానికి మార్చినట్టు తెలుస్తోందన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. బాధితుల రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్ పంపించామన్నారు. నివేదిక వచ్చిన తరువాతే ఇంజెక్షన్లో వాడుతున్న మందు ఏమిటనేది తేలుతుందన్నారు.
ఇదంతా చేస్తున్నది ఒక్కడేనా!
సైకోగా భావిస్తున్న ముసుగు వ్యక్తిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిన వరుసగా ఇంజెక్షన్లు చేయడం ఒక్కరి వల్లే జరిగే పని కాదని, ఏదైనా ముఠా ఇదంతా చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. డీఎస్పీ సౌమ్యలత నింది తుడు ఒక్కరేనని అయి ఉండొచ్చం టున్నా.. ఒక ముఠా ఉండొచ్చనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. సిద్ధాంతంలో బాలికకు ఇంజెక్షన్ చేసిన వ్యక్తి నీలం రంగు టీషర్టు, అదే రంగు ముసుగు, జీన్స్ ప్యాంటు ధరించాడని, నల్ల రంగు బైక్‌పై వచ్చాడని చెబుతున్నారు. నలజర్లలో వచ్చిన వాడు జీన్స్ ప్యాంటు, పసుపు రంగు టీషర్టు, నీలం రంగు ముసుగు వేసుకున్నాడని బాధితురాలు చంటి పేర్కొంటున్నారు.