విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు.
చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్‌ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు.
అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు.
అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు.
వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్‌ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.