ప్లీజ్... బాగా ఆడండి మళ్లీ ఓసారి చూస్తాం...
సాధారణంగా భారత క్రికెటర్ ఎవరు పరుగులు చేసినా ఆనందం వేసేది... ఈసారి మాత్రం పుజారా, రోహిత్ చేస్తున్న పరుగులు బాధగా అనిపించాయి... అవును... సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ మళ్లీ చూడకుండా ఈ పరుగులు ఆపాయేమో..! రోహిత్, పుజారాల శతకాలతో భారత్‌కు ఏకంగా 313 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వచ్చింది.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మన బౌలర్లు చకచకా వికెట్లు తీస్తుంటే విషాదంగా అనిపించింది.
వీళ్లు మళ్లీ తొందరగా ఆలౌటైతే భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుంది. కానీ... సచిన్ బ్యాటింగ్‌ను మళ్లీ చూడలేం.
కాబట్టి... వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఈ ఒక్కసారికి బాగా ఆడాలి. ప్రస్తుతం వెనకబడి ఉన్న 270కి మించి పదో, ఇరవయ్యో పరుగులు చేయాలి. భారత్‌కు కనీసం ఎంతో కొంత విజయలక్ష్యం కావాలి. అప్పుడు అవసరమైతే సచిన్‌ను ఓపెనర్‌గా పంపైనా మరోసారి చూసుకుంటాం..!
కరీబియన్స్ స్టార్స్... ప్లీజ్ బాగా ఆడండి. మరో 270 పరుగుల పైనే చేయండి. ఇదే ఇప్పుడు సగటు భారత క్రికెట్ అభిమాని కోరిక!
మది పులకించింది
‘ఒక మనిషిని 24 ఏళ్ల పాటు ఇంతగా ప్రోత్సహించడం, మద్దతుగా నిలవడం చాలా అసాధారణం. నాకు ఆ అదృష్టం దక్కింది. ఇన్నేళ్లుగా నన్ను నడిపించిన మీకందరికీ నా హృదయాంతరం నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ‘థ్యాంక్యూ సచిన్’ అనే మీ సందేశాలతో నా మది పులకించింది. నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ఇది ఉపయోగపడింది’.
- సచిన్ టెండూల్కర్