అదనపు కట్నం కోసం వేధింపులు
బాధితురాలి ఫిర్యాదుతో ఎన్నారై భర్తకు బ్లూ కార్నర్ నోటీస్
విజయవాడ: అదనపు కట్నం కోసం ఎన్నారై భర్త, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై విజయవాడ మహిళా పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లో ఉంటున్న యువకుడి తల్లిదండ్రులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న భర్తను రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ పటమటలంకకు చెందిన గుత్తికొండ కిషోర్ కుమార్తె లక్ష్మీగౌతమికి హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నెం.1కి చెందిన గోగినేని రాజేంద్రబాబు కుమారుడు శ్రీసత్యవర్థన్తో 2012లో వివాహం జరిగింది. రూ.కోటి నగదు, 200 కాసుల బంగారు నగలు లాంఛనాలుగా ముట్టచెప్పారు. వివాహ సమయంలో శ్రీసత్యవర్థన్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.
గౌతమి అమెరికాలోని వర్జీనియా వర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. వివాహమైన కొద్దికాలం నుంచే తల్లిదండ్రులు, ఉంగుటూరులో ఉంటున్న తాత గోగినేని విష్ణువర్ధనరావు ప్రోద్బలంతో శ్రీసత్యవర్థన్ భార్యను వేధింపులకు గురిచేశాడు. ఆమె పేరిట ఉన్న ఆస్తులను అమ్మి రూ.8 కోట్లు తెస్తేనే కాపురం చేస్తానని చెప్పడంతో..పెద్దలు నచ్చ చెప్పారు. పలుమార్లు నచ్చచెప్పినా ఫలితం లేకపోవడంతో గత నెల 16న లక్ష్మీగౌతమి నగరంలోని మహిళా పోలీసుస్టేషన్ అధికారులను ఆశ్రయించింది.
అదనపు కట్నం కోసం భర్త వేధిస్తుంటే..అత్తమామలు, అతని తాత ప్రోత్సహిస్తున్నట్టు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు అనుమతి తీసుకుని శుక్రవారం ఉదయం శ్రీసత్యవర్థన్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. అమెరికాలో ఉంటున్న శ్రీసత్యవర్థన్ను అదుపులోకి తీసుకునేందుకు ‘బ్లూ కార్నర్’ నోటీసు జారీ చేశారు.
కాగా, శ్రీసత్యవర్థన్ తల్లిదండ్రులు పలుకుబడినవారు కావడంతో పోలీసులపై ఒత్తిళ్లు పెరిగాయి. ఇదే సమయంలో కేసు విషయంలో మరోసారి ఆలోచించుకోమంటూ లక్ష్మీగౌతమి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసే పనిలో పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం. కాగా, శ్రీసత్యవర్థన్ తల్లిదండ్రులను విచారణ కోసమే తీసుకొచ్చినట్టు మహిళా పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ సహేరా తెలిపారు. విచారణ జరిపిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు.