సిలికానాంధ్ర మనబడికి ‘వాస్క్’ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో 35 రాష్ట్రాలతోపాటు మరో 12 దేశాల్లో తెలుగులో వారాంతపు బోధనా తరగతులు నిర్వహిస్తున్న ‘సిలికానాంధ్ర మనబడి’కి ప్రతిష్టాత్మక ‘వాస్క్’ (వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్) గుర్తింపు లభించింది. ఈ మేరకు మనబడి సంచాలకులు శ్రీదేవి గంటి ప్రకటన విడుదల చేశారు. వాస్క్ గుర్తింపు కోసం మనబడి డీన్ రాజు చమర్తి నాయకత్వంలో దాదాపు 18 నెలలుగా అహర్నిశలూ పనిచేసినట్లు తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాలిఫోర్నియాలోని శాన్హోస్ నగరంలోగల పార్క్సైడ్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత్ నుంచి ముఖ్య అతిథులుగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి, జగన్ బుద్ధవరపు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాస్క్ సంచాలకులు డాక్టర్ జింజర్ హన్నిక్ మాట్లాడుతూ ‘మనబడి’లో తెలుగు నేర్చుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిరుచి తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. కార్యక్రమంలో మనబడి సభ్యులు ఆనంద్ కూచిభొట్ల, దీనబాబు కొండుభట్ల, దిలీప్ కొండిపర్తి, భాస్కర్ రాయవరం, సంజీవ్ తనుగుల, ప్రభ మాలెంపాటి, శాంతి కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.