ఏదైనా కొనేస్తాం..
అమెరికాకు దీటుగా గతకాలపు ప్రాభవాన్ని మళ్లీ సాధించే దిశగా అడుగులు వేస్తున్న రష్యాలో ప్రజల ఆర్థిక అలవాట్ల గురించి ఈ వారం కంట్రీ కథలో..
గతంలో ఏదైనా కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు రష్యన్లు. అత్యంత జాగ్రత్తగా ఖర్చుపెట్టేవారు. కానీ ప్రస్తుతం ట్రెండు మారి.. వెస్ట్రన్ ధోరణి పెరుగుతోంది. ఖర్చు చేసే విషయంలో చాలా స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. దాచి పెట్టడం కన్నా ఖర్చు పెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా ఫ్రిజ్‌లు, గృహోపకరణాలు, ఆహార పదార్థాలు, దుస్తులు వంటి వాటిపై ఎక్కువగా రష్యన్లు ఖర్చు పెడుతున్నారు. అలాగే, హాలిడే టూర్లు, పార్టీలపైనా బాగానే వెచ్చిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే సగటు రష్యన్లు గృహోపకరణాలపై రెండు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తారట. వాషింగ్ మెషిన్లు, మొబైల్ ఫోన్లు వంటి వాటి కొనుగోళ్ల విషయంలో.. యూరప్‌లో మిగతా దేశాల వారిని అధిగమించేశారు రష్యన్లు. బీరు వినియోగంలో జర్మన్లతో పోటీపడుతున్నారు.
ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొచ్చినప్పుడు.. డబ్బుపరంగా దాచుకోవాలంటే అది తమ కళ్లముందు కనిపించే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు రష్యన్లు. బ్యాంకులు, వర్చువల్ ఇన్వెస్ట్మెంట్లు మొదలైన వాటి జోలికి ఎక్కువగా పోరు. అధికాదాయ వర్గాలకు చెందిన వారు రియల్ ఎస్టేట్‌పై ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇవి గాకుండా కార్లు కూడా బాగానే కొంటారు. జర్మనీలో తయారైన వాటికి కాస్త ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. రష్యాలో కేవలం అయిదు శాతం జనాభా మాత్రమే స్టాక్స్, మ్యుచువల్ ఫండ్స్ వాటి వాటిల్లో నేరుగా పెట్టుబడి పెడుతుంటారు. కేవలం రెండు శాతం జనాభాకు మాత్రమే బీమా కవరేజి ఉంది. క్రెడిట్ కార్డుల వినియోగంలో మాత్రం రష్యన్లు బాగా చురుగ్గానే ఉన్నారు.