Whale vomit
-
Whale Vomit: వాంతి విలువ రూ.28 కోట్లు!
తిరువనంతపురం: ఛీ.. ఏంటిది? నిజమేనా.. వాంతికి కోట్లు పలకడం ఏమిటని అవాక్కవుతున్నారా? ఏదైనా పడనిది.. పనికిరానిది తిన్నప్పుడు వాంతి రావడం సహజమే.. శరీరమే విసర్జించిన దాంట్లో విలువైనది ఏముంటుందబ్బా అని తెగ ఆలోచిస్తున్నారా? అంత బుర్రబద్దలు కొట్టుకోకండి.. ఎందుకంటే ఇది మనుషుల వాంతి కాదు.. ఓ భారీ తిమింగలానిది. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని వంజిమ్లో కొందరు జాలర్లు తాజాగా సముద్రంలో చేపల వేటకు వెళ్లగా వారి వలకు ఏదో చిక్కింది. దీంతో సంబరపడ్డ వారు వలను లాగి చూడగా అందులో ఏకంగా 28.4 కిలోల బరువైన స్పర్మ్ వేల్ వాంతి కనిపించింది! అంతరించే దశలో ఉన్న ఈ జాతి తిమింగలాలకు చెందిన పదార్థాలను విక్రయించడాన్ని కేంద్రం వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద నిషేధించడంతో జాలర్లు పోలీసులకు అప్పగించారు. వారు దాన్ని అటవీ అధికారులకు ఇవ్వగా ఆ అధికారులు అది తిమింగలం వాంతా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి తరలించారు.పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగించే తిమింగలం వాంతి కిలో ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ. కోటి వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన జాలర్లకు దొరికిన తిమింగలం వాంతి విలువ రూ. 28 కోట్లకుపైనే ఉంటుందని లెక్కగట్టాయి. ఇదీ చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
కోట్లు విలువ చేసే పదార్థం అమ్మే ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్
ముంబై: సముద్రాల్లో తిమింగళాలు చేసుకునే వాంతిని(అంబర్గ్రిస్) పెద్దమొత్తంలో అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు మాజీ పోలీస్ కూడా ఉండడం విశేషం. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీ ముడిపదార్థంగా అంబర్‌గ్రిస్‌ను వాడుతుంటారు. విషయంలోకి వెళితే.. ముంబైలోని లోవర్ పారెల్ ప్రాంతంలో గురువారం ఎస్యూవీ కారులో ఇద్దరు వ్యక్తులు తిమింగళం వాంతి(అంబర్‌గ్రిన్)ని తీసుకెళుతున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్థారణ చేసుకున్న పోలీసులు సీతానగరం మిల్స్ వద్ద వారిని అడ్డుకొని 7.75 కోట్లు విలువ చేసే తిమింగళం వాంతిని స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులలో ఒకరు మాజీ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. 2016లో అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. తాజాగా రాయ్‌గడ్ జిల్లాలోని అలీబాగ్ తీర ప్రాంతంలో తిమింగళం వాంతి పదార్థాన్ని దొంగలించినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చదవండి: ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం -
ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం..
సాక్షి, హైదరాబాద్: సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్గ్రిస్(తిమింగళం వాంతి) పేరుతో మోసాలకు పాల్పడున్న ముఠాను ఖైరతాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్గ్రిస్ పేరుతో నకిలీ పదార్థం అమ్మేందుకు యత్నించిన ఏడుగురు సభ్యుల గల ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ ఈ గ్యాంగ్ మోసాలకు తెగబడుతుంది. ఖైరతాబాద్‌లోని ఎస్బీఐ వీధిలో ఓ గదిని కార్యాలయంగా మార్చుకుని వీరు మోసాలకు పాల్పడుతున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీర్ అలీ, షేక్ అలీ, మహమ్మద్ ఆరిఫ్ మహమ్మద్ నజీర్, మోహన్‌లాల్ యాదవ్, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ హుస్సానుద్దీన్లు గ్యాంగ్‌గా ఏర్పడి.. ఈ తరహా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు -
బీచ్‌లో బ్రిటన్ జంట పంట పండింది
లండన్: మీరు ఎప్పుడైనా బీచ్‌ల వెంట నడిచి వెళుతుంటే సువాసనలు వెదజల్లే రాళ్లు కనుకొన్నారా.. ఒక వేళ నిజంగా కనుకొన్నారో ఇక మీ దశ మారినట్లే. ఎందుకంటే బంగారం కన్నా విలువైన ఆ రాళ్లను 'వేల్ వామిట్' అంటారు. దీనికే అంబరు అనే పరిమళ ద్రవ్యము అని పేరు కూడా ఉంది. అంటే మగ తిమింగిలాల జీర్ణవ్యవస్థలో చోటుచేసుకునే రసాయన క్రియల వల్ల ఏర్పడిన ఓ మృదువైన పదార్థం దాని కడుపులో అజీర్తిగా ఉండిపోయి వాంతు చేసుకోవడం ద్వారా బయటకు వస్తుందన్నమాట. ఇలా వచ్చిన పదార్థం సముద్రంలో తేలియాడే క్రమంలో అలలతాకిడికి ఒడ్డున పడిపోతుంది. అలా పడిన ఆ రాయిలాంటి పదార్థం కేజీల్లో కూడా ఉండొచ్చు. చక్కటి సువాసన మాత్రం అది గుప్పున వెదజల్లుతుంది. అలా వెదజల్లే వేల్ వామిట్ మీకు దొరికిందా ఇక కోటీశ్వరులైపోయినట్లే. ఎందుకంటే దీనితో పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. అయితే, ఈసారి బ్రిటన్‌లో ఇద్దరుదంపతుల పంటపండింది. గ్యారీ, ఎంజెలా విలియమ్స్ అనే భార్య భర్తలు అలా మిడిల్టన్ సముద్రం ఒడ్డుగుండా నడిచివెళుతుండగా వారికి ఇది దొరికింది. అయితే, దానిని గుర్తించడం అంత తేలిక కాదని, బహుషా నిజంగా వారికి దొరికింది తిమింగలం వాంతు చేసుకోవడం ద్వారా బయటకొచ్చిన పదార్థమే అయితే, దాని విలువ కనీసం రూ.46,65,565.59(70 వేల డాలర్లు) ఉంటుందని ప్రముఖ రచయిత క్రిస్టోఫర్ కెంప్ అంటున్నారు. కాగా, ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తం వేల్ వామిట్ దొరకలేదని గతంలో 2012లో ఎనిమిదేళ్ల బ్రిటన్ విద్యార్థికి 1.3 ఫౌండ్ల వేల్ వామిట్ దొరికిందని దాని ధర 63,000 డాలర్లు ఉందని చెప్పారు.