ప్రమాణాల స్వామికే పంగనామాలా!
*కాణిపాకం దేవస్థానం గోడౌన్లో నాసిరకం సరుకులు
*పాలకమండలి తనిఖీల్లో బయటపడిన వైనం
*మిరియాల్లో ఎక్కువగా బొప్పాయి గింజలు
*కుంకుమ పువ్వుకు బదులుగా కొబ్బరి పువ్వు
కాణిపాకం : ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడినే కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు. స్వామివారి ఏకాంత సేవకు వినియోగించే సరుకులను కూడా నాసిరకమైనవి సరఫరా చేస్తున్నారు. శుక్రవారం పాలకమండలి సభ్యుల ఆకస్మిక తనిఖీలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే లడ్డూ పోటును పాలకమండలి సభ్యులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గోడౌన్లో నాసిరకం, నకిలీ సరుకులు ఉండడాన్ని గుర్తించారు. మిరియాల్లో ఎక్కువగా బొప్పాయి గింజలు ఉన్నాయి. కుంకుమపువ్వుకు బదులు కొబ్బరి తురిమి రంగు వేసి పదార్థాన్ని కాంట్రాక్టర్ సరఫరా చేసి ఉన్నారు. జీడిపప్పు మూడవ రకం, అభిషేక ప్రసాదాలకు వినియోగించే బియ్యం రెండో రకం ఉన్నారుు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్పర్సన్ లతా రాజ్‌కుమార్, సభ్యులు సుబ్రమణ్యం రెడ్డి,ఆలయ ఏఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
కాంట్రాక్టర్‌పై చర్యలు
తనిఖీల అనంతరం పాలక మండలి చైర్పర్సన్ లతా రాజ్‌కుమార్ మాట్లాడుతూ నాసిరకం, నకిలీ వస్తువులను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. నాసిరకం,నకిలీ సరుకులను పంపిణీ చేస్తున్నా ఆలయ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. స్వామివారి ఆర్జిత సేవకు వినియోగించే కుంకుమ పువ్వు సైతం నకిలీది కావడం బాధాకరమన్నారు. నకిలీ,నాసిరకం వస్తువుల వల్ల ప్రసాదాల నాణ్యత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయ అధికారుల సహకారమేనా?
గత కొన్నేళ్లుగా తిరుపతికి చెందిన ఓ కాంట్రాక్టర్ స్వామివారి ఆలయానికి అవసరమైన సరుకులను అందిస్తుంటారు. వీటిని టెండరు ద్వారా మూడు నెలలకు ఒకసారి తెప్పించుకుంటుంటారు. బిల్లులు లక్షల్లో ఉంటున్నాయి. దీన్నిబట్టి ఎడాదికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలను మింగిస్తున్నారని తెలుస్తోంది. దేవస్థానం అధికారుల సహకారం వల్ల నాసిరకం సరుకులు సరఫరా అవుతున్నాయా అనే అనుమానాలున్నాయి.