నేటి నుంచి పోలింగ్ స్లిప్‌ల పంపిణీ
చౌటుప్పల్/కలెక్టరేట్, న్యూస్‌లైన్,మొదటి విడతలో ప్రాదేశిక ఎన్నికలు జరిగే మండలాల్లో గురువారం నుంచి పోలింగ్ స్లిప్‌లను పంపిణీ చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు బూత్‌లెవల్ సిబ్బందిని ఆదేశించారు. మొదటి విడతలో ఎన్నికలు జరిగే మండలాలకు చెందిన జోనల్ అధికారులతో బుధవారం సాయంత్రం చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 33 మండలాల్లో మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయన్నారు. ఇప్పటికే బ్యాలెట్బాక్సులు, బ్యాలెట్ పేపర్లు అన్ని మండలాలకు పంపిణీ చేశామని చెప్పారు. గురువారం ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను సరిచూసుకోవాలన్నారు.
మొదటి విడత ఎన్నికలు జరిగే డివిజన్లలో 500 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా, 800 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు *2కోట్ల వరకు నగదు పట్టుకున్నామని, 8 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని వివరించారు. బుధవారం చౌటుప్పల్‌లో పట్టుబడిన *1.62 కోట్ల విషయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలియజేశామని చెప్పారు.
మద్యాన్ని కూడా భారీగా నియంత్రించామని, గత ఏడాది ఏప్రిల్‌లో సరఫరా చేసిన కోటానే ప్రస్తుతం మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జగన్‌రెడ్డి, శకుంతల, దేవసహాయం, శేషాద్రి, శ్రీనివాస్‌రావుతో పాటు కలెక్టరేట్ నుంచి జేసీ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావు, ఎన్నికల పరిశీలకులు ప్రియదర్శిని, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.