వైట్ లేబుల్ ఏటీఎంలలోకి 100% ఆటోమేటిక్ ఎఫ్డీఐలు..
వైట్ లేబుల్ ఏటీఎం(డబ్ల్యూఎల్ఏ) కార్యకలాపాల్లో ఇక 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)ను ఆటోమేటిక్ రూట్లో అనుమతించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్క్లూజన్) కోసం చేపడుతున్న చర్యలకు దీనివల్ల ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకూ వైట్లేబుల్ ఏటీఎం కార్యకలాపాల్లో ప్రభుత్వ అనుమతి రూట్లోనే ఎఫ్డీఐలకు వీలుంది. బ్యాంకింగేతర సంస్థలేవైనా తమ సొంత బ్రాండ్ల పేరుతో ఏర్పాటు చేసే ఏటీఎంలనే డబ్ల్యూఎల్ఏలుగా పిలుస్తారు. శ్రేయీ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, వక్రాంగీ సాఫ్ట్వేర్ తదిత కంపెనీలు ప్రస్తుతం డబ్ల్యూఎల్ఏలను నిర్వహిస్తున్నాయి. దేశంలో 54 ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాం కులు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటి మొత్తం ఏటీఎంల సంఖ్య 1.82 లక్షలుగా అంచనా.
భారం కానున్న ఏటీఎం చార్జీలు?
వైట్ లేబుల్ ఏటీఎంల ఏర్పాటుకు ఎఫ్డీఐ నిబంధనలు సరళం కావడంతో విదేశీ కంపెనీలు, ఫీజు ఆదాయాన్ని భారీగా ఆర్జించేందుకు ఇక్కడ అధికస్థాయిలో ఆ తరహా ఏటీఎంలను ప్రవేశపెడతాయి. ఈ ఏటీఎంలలో ఏ బ్యాంకు కార్డునైనా వినియోగించుకునే వీలుంటుంది. వీటి సంఖ్య పెరిగేకొద్దీ.. బ్యాంకులు వాటి సొంత ఏటీఎం నెట్వర్క్ను తగ్గించుకునే అవకాశం వుంటుంది. దాంతో వినియోగదారు క్రమేపీ వైట్ లేబుల్ ఏటీఎంలను చార్జీలు చెల్లించి వాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని బ్యాంకింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.