తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్నవారికి తెల్ల రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పౌర సరఫరాలశాఖ అధికారులు రచ్చబండ-2లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించారు. గ్రేటర్ మొత్తం మీద తెల్లరేషన్ కార్డుల కోసం సుమారు రెండున్నర లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వాటిలో సుమారు లక్ష మందిని అర్హులుగా అధికారులు గుర్తించి జాబితా తయారు చేశారు. వీటిలో హైదరాబాద్‌లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 58 వేల వరకు మంజూరు కానున్నాయి. దీంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పేదల కల నెరవేరనుంది.
తెల్లకార్డుల ఘనత వైఎస్సార్‌దే..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాకముందు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెల్లరేషన్ కార్డులు ఆరు లక్షలు కూడా లేవు. ఆయన సీఎంగా వచ్చాక నిరుపేదలందరికి తెల్ల రేషన్‌కార్డులు వర్తింపజేయడంతో ఆ సంఖ్య రెండింతలకు పెరిగింది. కొత్త కార్డుల పంపిణీలో క్షేత్రస్థాయిలో జరిగిన లోపాల వల్ల కొందరు అనర్హులు కార్డులు పొందారు. దీంతో కొన్నింటిని రద్దు చేశారు.
అంతకుముందే కొందరిని అర్హులుగా తేల్చినా 2009 ఎన్నికల నియమావళి కారణంగా కొత్త తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయలేదు. అయితే, వీరికి నెలవారి సరుకులు పొందేందుకు తాత్కాలిక కూపన్లను ఇచ్చారు. అనంతరం 2010 జనవరి నుంచి 2011 ఫిబ్రవరి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తెల్లరేషన్ కార్డుల అర్హులను ఎంపిక చేశారు. అయినా, వీరికి రేషన్ కార్డులు జారీ చేయలేదు.
2011 నవంబరులో నిర్వహించిన రెండో దశ రచ్చబండలో ఆరు నెలలకు సరిపోయేలా తాత్కాలిక కూపన్లు జారీ చేసి అప్పటి నుంచి 2013 మార్చి వరకు కూపన్ల విధానాన్ని పొడిగిస్తూ వచ్చారు. కార్డుల పంపిణీకి ఇప్పటికే ఉన్నత స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో రెండు జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. అయితే, పంపిణీకి అధికారికంగా అదేశాలు అందాల్సి ఉంది.