జిల్లా కేంద్రాల్లోనూ వైట్‌టాపింగ్: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రయోగాత్మకంగా చేస్తున్న వైట్‌టాపింగ్ కాంక్రీట్ పనుల్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో జరుగుతున్న వైట్‌టాపింగ్ పనుల్ని మంత్రి శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉందని, భారీ వర్షాలకు ఇవి త్వరగా దెబ్బతింటున్నాయని అన్నారు. అయితే వైట్‌టాపింగ్ రోడ్లు 20 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటాయని చెప్పారు.
వైట్‌టాపింగ్ నిర్మాణం సత్ఫలితాలను ఇస్తే దీన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో చేపడతామని చెప్పారు. సీసీ రోడ్ల కంటే వైట్‌టాప్ నిర్మాణం అత్యంత ఆధునికమైనదన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఈ వైట్‌టాపింగ్ పనుల్ని నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో ఈఎన్సీ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.