తాగి కారు నడిపిన యువతికి శిక్ష నుంచి ఊరట
తాగిన మత్తులో కారు నడుపుతూ వీడియో తీస్తూ ఆన్ లైన్ లో చాట్ చేసిన యువతికి అమెరికా కోర్టు జైలు శిక్ష నుంచి ఉపశమనం ఇచ్చింది. తొలిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశానని, దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న నిందితురాలి వాదనతో కోర్టు ఏకీభవించింది. అయితే ఆమెను సంవత్సరం పాటూ మద్యం సేవించకుండా పోలీసుల పరిశీలనలో ఉంచాలని కోర్టు తెలిపింది. అంతేకాకుండా ఆరు నెలలపాటూ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. 150 గంటల పాటూ కమ్యూనిటీ సర్వీస్‌తో పాటూ 10 వారాతంపు రోజుల్లో పని చేసుకోవడానికి పోలీసుల పరిశీలననుంచి విముక్తి ఇచ్చారు.
తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ ఓ యువతి గత ఏడాది పోలీసులకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల వైట్నీ బీల్ ...అమెరికాలోని లేక్ ల్యాండ్, ఫ్లోరిడాలో తాగిన మత్తులో కారు నడిపింది. అయితే అదే సమయంలో తన ఫోన్ లో తన చేష్టలని వీడియో తీస్తూ ఆన్ లైన్ గ్రూప్(పెరీస్కోప్) లో చాట్ చేసింది.
ఆ వీడియోను చూసిన వాళ్లు ఆ యువతి తాగిన మత్తులో కారు నడిపి ఎక్కడ ప్రమాదానికి గురిఅవుతుందోనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ ఆధారంగా ఆమె ప్రయాణిస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వెంబడించారు. వైట్నీ బీల్ ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా తప్పించుకోవాలని చూసింది. చివరకు ఫుట్ పాత్‌ను ఢీకొట్టి కారును ఆపింది. తాగి వాహనం నడిపినందుకుగానూ ఆమెపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.