కూరగాయలు కుతకుత
నియంత్రణ లేని ఫలితం... నింగికెగసిన ధరలు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల తరుణంలో నిత్యావసరాలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల హడావుడి, కోలాహలం ముగిసినా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 12 రోజుల వ్యవధి ఉండటంతో నిత్యావసరాలపై అధికారుల పర్యవేక్షణ లేకుండాపోయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ కూరగాయల వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. అన్ని వర్గాల ప్రజలు నిత్యం వినియోగించే టమోట, పచ్చిమిర్చి, బీర, బెండ, గోకర, చిక్కుడు, దోస వంటి వాటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఎన్నికల ముందున్న ధరలతో ప్రస్తుత ధరలను పోలిస్తే కొన్ని రకాల కూరగాయలపై రూ.10-20 వరకు పెరుగుదల కన్పిస్తోంది.
టమోట, మిర్చి ధరలు పెరగడం గృహిణులను కలవరపెడుతోంది. గత నెలలో కేజీ రూ.8-10కి లభించిన టమోట ప్రస్తుతం రూ.20కి, అలాగే రూ.15-20 ఉన్న పచ్చిమిర్చి రూ.40కి ఎగబాకాయి. ఈ సీజన్లో ఉత్పత్తి తక్కువగా ఉంటే బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, వంకాయ, బీరకాయ ధరలు రైతుబజార్లో కాస్త తక్కువగానే ఉన్నా, బహిరంగ మార్కెట్లో భగభగమంటున్నాయి. గిరాకీని బట్టి వ్యాపారులు ధర నిర్ణయించి సొమ్ము చేసుకొంటున్నారు. తోపుడు బండ్ల వారైతే మరో రూ.5 అదనంగా వసూలు చేస్తున్నారు.
ఇష్టానుసారం ధరల దోపిడీ
టోకు మార్కెట్లో పచ్చిమిర్చి ధర కేజీ రూ.16 ఉండగా, రైతుబజార్లో మాత్రం రూ.18కి విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. గత నెలలో కేజీ రూ.15-20కు లభించిన పచ్చిమిర్చి ఇప్పుడు రూ.40కి ఎగబాకడంతో సామాన్యుడి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అసలు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో బతుకు భారంగా మారిన సామాన్యుడు పచ్చడి మెతుకులతో సరిపుచ్చుకొందామనుకొన్నా మిర్చి, టమోట ధరలు ఠారెత్తిస్తుండటం గొంతులోకి ముద్ద మింగుడు పడకుండా ఉంది. పెరిగిన ధరలను చూసి మధ్యతరగతి వర్గాలతో పాటు సామాన్య, పేద వర్గాల ప్రజలు జేబులు తడుముకొనే పరిస్థితి నెలకొంది. కాగా, నగరంలో నిత్యం 80-100 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ఇప్పుడిది 30-40 టన్నులకు మించట్లేదని, ఆ కొరత ప్రభావం ధరలపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు.