మంచిని పెంచడమే విశ్వాసుల కర్తవ్యం
ఇస్లాం వెలుగు
స్వీయ సంస్కరణతో పాటు, సమాజ సంస్కరణ బాధ్యత కూడా దైవ విశ్వాసులపై ఉంది. నైతిక, మానవీయ విలువలతో కూడిన సుందర సత్సమాజ నిర్మాణం కోసమే విశ్వాసులను ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. సమాజంలో ఏ విధమైన దుష్కార్యాలు, దుర్మార్గాలు జరగకుండా చూడడం; మంచిని, సత్కార్యాలను పెంపొందించడం విశ్వాసుల విధి. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది.
‘‘విశ్వసించిన ప్రజలారా! ఇక నుంచి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ, వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. చెడులనుండి వారిస్తారు’’ (3-110). అంటే సమాజంలో మంచిని వ్యాపింపజేయడం, చెడులను నిరోధించడం దైవ విశ్వాసుల విద్యుక్త ధర్మమన్నమాట. సమాజంలో దుర్మార్గాలు ప్రబలిపోతూ ఉంటే చూస్తూ కూర్చోవడం విశ్వాసుల లక్షణం ఎంతమాత్రం కాదు.
చెడులకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా శక్తి మేరకు పోరాడాలి. చెడులు అంతమయ్యే వరకు పోరాటం ఆపరాదు. అందరూ కలసి సంఘటిత ఉద్యమం ద్వారా వీటి నిర్మూలనకు కృషి చేయాలి. అదే సమయంలో మంచి పనుల వైపునకు ప్రజలను ప్రోత్సహించాలి.
సత్కార్యాల వల్ల ఒనగూడే ప్రయోజనాలను వారికి వివరించాలి. దుష్కార్యాల పర్యవసానాన్ని ఎరుక పరుచుకోవాలి. ఇహ పర లోకాల్లో ఎదురయ్యే పరాభవాల పట్ల ప్రజలను అప్రమత్తుల్ని చేయాలి. దైవ విశ్వాసం, పరలోకం, మరణానంతర జీవితం పట్ల విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంటే, అంతగా విశ్వాసుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- మహ్మద్ ఉస్మాన్‌ఖాన్