వెనుదిరిగి చూసుకోను: సాహా
కోల్‌కతా: బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుకాగా, అలాంటి వాటిని పట్టించుకోరాదని టీమిండియా ప్లేయర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియాపై నెగ్గిన టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన సాహా మీడియాతో ముచ్చటించాడు. 'ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎప్పుడూ ముందుకెళ్లాలి. అంతేగానీ గతంలో ఏం జరిగింది అని ఆలోచిస్తూ వెనుదిరిగి చూసుకోకూడదన్నాడు. జట్టుతో చేరినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి.. మనకు ఏం బాధ్యతలు అప్పగిస్తున్నారో గమనించాలి.
ఐపీఎల్ కోసం ముందు జాగ్రత్తగా కోహ్లీ చివరి టెస్టుకు దూరమయ్యాడని బ్రాడ్ హాడ్జ్ వ్యాఖ్యలు అర్ధరహితం. ఆసీస్ పై విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆసీస్‌తో స్నేహం ఉండదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అయితే ఆటలో భాగంగా స్లెడ్జింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంకా చెప్పాలంటే దేశవాళీ మ్యాచ్ లలోనూ స్లెడ్జింట్‌ను ఆస్వాదిస్తాను. రాంచీ టెస్టు శతకం ఎప్పటికీ ప్రత్యేకమే. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను' అని సాహా చెప్పాడు.