బృందావన్లో వితంతువుల వసంత కేళీ
బృందావన్(యూపీ): వారంతా పసుపు-కుంకుమలకు దూరమైన వితంతువులు. వసంతాలు వెలిసిపోయిన వారి జీవితాల్లో హోలీ మళ్లీ రంగులు పూయించింది. మోడు వారిన వింతువుల జీవితాల్లో వసంత కేళి ఆనందోత్సాహాలు నింపింది. దాదాపు వెయ్యి మంది వితంతువులు హోలీ ఆడుతూ మళ్లీ రంగుల లోకంలో విహరించారు.
ఈ అపూర్వ ఘట్టం ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో జరిగింది. మీరా సహభాగిని ఆశ్రమం వేదికగా నిలిచింది. కృష్ణుడి భక్తులు, పర్యాటకుల సమక్షంలో ఒకరిపై ఒకరు రకరకాల రంగులు చల్లుకుంటూ వసంత కేళి ఆడారు. నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. బృందావన్ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో వితంతువులు హోలీ వేడుకల్లో ఇది మొదటిసారి. హోలీ వేడుకల కోసం 500 కిలోలకు పైగా రంగులు, గ్యాలన్లకొద్దీ నీరు వినియోగించారు.
మహిళల సాధికారత కృషి చేస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బృందావన్లో ఉన్న ఆశ్రమాల్లో వేలాది మంది వితంతువులు ఉంటున్నారు. వీరందరి కోసం సాంప్రదాయ రాసలీల న్యత్యం, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. గతేడాది పూలు చల్లుకుని వితంతువులు ఇక్కడ హోలీ వేడుకలు జరుపుకున్నారు.