కల్నల్ భర్త మరణం.. ఆర్మీలోకి భార్య!
గత నవంబర్ లో జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఆర్మీ కమాండో సంతోష్ మహాదిక్ భార్య స్వాతి మహాదిక్ వచ్చే ఏడాది ఇండియన్ ఆర్మీలో చేరనున్నారు. సంతోష్ మహాదిక్ అంత్యక్రియల సమయంలో ఆమె ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపడంతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ ఆమెకు వయసు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) పరీక్షలో ఆమెకు వయోపరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు.
గత వారం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో కష్టతరమైన ఐదు రౌండ్లను ఆమె ఎదుర్కొన్నారు. సోమవారం మెడికల్ పరీక్షకు హాజరై.. విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో 38 ఏళ్ల స్వాతి మహాదిక్ వచ్చే ఏడాది ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశం ఏర్పడింది. దీనిపై స్పందించడానికి ఆమె తిరస్కరించారు. గత ఏడాది నవంబర్ 27న కుప్వారాలోని ఎల్ఓసీ వద్ద జరిగిన మిలిటెంట్ల దాడిలో యూనిట్ 41-రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సంతోష్ మహాదిక్ వీరమరణం పొందారు. గణతంత్ర దినోత్సవం నాడు భారతప్రభుత్వం ఆయనను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది.