మద్యానికి డబ్బివ్వలేదని..
భార్య గొంతుకోసి హత్య సంక్రాంతి రోజే దారుణం
కేవీబీ పురం(పిచ్చాటూరు): మద్యానికి డబ్బు ఇవ్వలేదని గొంతుకోసి భార్యను హత్య చేసిన సంఘటన కేవీబీపురం మండలం సీకే పురంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సీకేపురానికి చెందిన కృష్ణయ్య(49), అముద(37) 19 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రమ్య(17), శశి చంద్రిక(8) కుమార్తెలు ఉన్నారు. గ్రామానికి పక్కనే ఉన్న ఆదిత్య మిల్లులో అముద, పెద్ద కుమార్తె రమ్య కూలి పని చేస్తున్నారు.
కృష్ణయ్య కూడా అదే కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మానేశాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బు కోసం తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. శనివారం తెల్లవారుజామున అముద కేకలు వేసింది. పక్క గదిలో పడుకున్న పిల్లలు లేచి వెళ్లారు. కృష్ణయ్య పరుగులు తీస్తూ కనిపిం చాడు. లోపలికి వెళ్లి చూడగా తల్లి అముద రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్థానికులు వచ్చి చూసే సరికి ఆమె మృతిచెందింది. పండుగ రోజే హత్య జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పుత్తూరు సీఐ సాయినాథ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి పెద్ద కుమార్తె రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దార్యప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.