భార్య మీద కోపంతో.. కూతురి దారుణహత్య
బిహార్లోని కతిహార్ జిల్లాలో ఓ వ్యక్తి తన సొంతకూతురినే దారుణంగా కొట్టి, పీకపిసికి చంపేశాడు. తన భార్య తనను వదిలిపెట్టి వేరే వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతోనే అతడు ఇదంతా చేశాడు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని పట్నాకు 304 కిలోమీటర్ల దూరంలో గల కతిహార్ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మహ్మద్ ముస్తాక్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఇటీవల వదిలేసింది. ఎనిమిదేళ్ల కూతురు సుహానీ మాత్రం అతడితోనే ఉంటోంది. అంతలో తన భార్య ఢిల్లీలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని అతడికి తెలిసింది. దాంతో విపరీతంగా కోపం వచ్చిన ముస్తాక్.. తన కూతుర్ని బాగా కొట్టాడు. ఇంకా కోపం తగ్గక.. ఆమె పీక పిసికి చంపేశాడని టౌన్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ అనుపమ్ కుమార్ చెప్పారు.
రోజుకూలీ అయిన ముస్తాక్పై అతడి అత్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టుచేసి, జైల్లో పెట్టారు. ముస్తాక్ భార్య దుఖ్నీ ఖాతూన్ (35) భర్తను వదిలిపెట్టి ఐదు నెలల క్రితం ఒక కొడుకు, కూతురితో కలిసి ఢిల్లీ వెళ్లిపోయింది. అప్పటినుంచి తన సోదరి వద్ద ఉంటోంది. వాళ్లకు మరో ముగ్గురు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లంతా ముస్తాక్తోనే ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం పెళ్లయినప్పటి నుంచి ముస్తాక్ తన అత్తవారింట్లోనే ఉంటున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో తరచు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుండేవి. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఖాతూన్.. ఐదు నెలల క్రితం భర్తను వదిలిపెట్టి ఢిల్లీ వెళ్లిపోయింది.