Wife swapping
-
భర్త వికృత చర్యపై పోలీసులకు భార్య ఫిర్యాదు
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తమ లైంగికానందం కోసం బలవంతంగా భార్యలను మార్పిడి చేసుకుంటున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఓ మహిళ తన భర్తతోపాటు, మరో ముగ్గురిపై ఫిర్యాదు చేసింది. వ్యాపారవేత్త అయిన భర్త తనను అక్రమ లైంగిక సంబంధంలో పాల్గొనాలని బలవంతం చేస్తున్నాడని ఆమె పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. ముంబైలోని సమతానగర్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని బుధవారం ఆ వ్యాపారవేత్త(46)ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి డిసెంబర్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కాగా భర్త తన వికృత కోర్కెను భార్య ముందు ఉంచగా, అందుకు ఆమె అంగీకరించలేదు. తనకు ఇలాంటి వ్యవహారంలో పాల్గొనడం ఇష్టం లేదని భార్య స్పష్టం చేసింది. అయితే ఆమెను బెదిరించి, భయపెట్టి బలవంతంగా పర పురుషుడి వద్దకు పంపాడు. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడిన భర్త.. భార్య మార్పిడిలో పాల్గొన్నప్పుడు రహస్యంగా వీడియో తీశాడు. అప్పటినుంచి ఈ దారుణం గురించి ఎవరికీ చెప్పకుండా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. అయితే భర్త చేష్టలతో విసిగిపోయినా బాధితురాలు అతడి నుంచి దూరంగా వెళ్లి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. ఈ విషయమంతా తల్లిదండ్రులకు చెప్పడంతో భార్య మార్పిడికి సహకరించే ఇతర జంటలను తన భర్త ఎలా కలుసుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. అతను తన వాట్సాప్ గ్రూప్.. సోషల్ మీడియా ద్వారా ఇతర జంటలతో మాట్లాడి దీనికి పాల్పడుతున్నట్లు తెలిసిందని వెల్లడైంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్తతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యల మార్పిడి; నలుగురి అరెస్ట్
తిరువనంతపురం: లైంగికానందం కోసం భార్యలను మార్చుకుంటున్న నలుగురు వ్యక్తులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు అలప్పుజ జిల్లాలోని కయంకుళం పట్టణంలో ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొత్త వారితో లైంగిక చర్యలో పాల్గొనాలని తన భర్త వేధించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారం రట్టు కావడంతో కేరళలో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది మార్చిలో ‘వైఫ్ స్వాపింగ్’ ఇక్కడ ప్రారంభమైంది. సోషల్ మీడియా యాప్ ‘షేర్ చాట్’లో పరిచయమైన కాలికట్కు చెందిన అర్షద్ అనే వ్యక్తితో ఏకాంతంగా గడపాలని తన భర్త వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా బాధితురాలి భర్తతో పాటు నలుగురిని అరెస్ట్ చేసి, ఐపీసీ 366 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టైన వారిలో కిరణ్, సీది, ఉమేశ్, బ్లెసరిన్ ఉన్నారని వెల్లడించారు. -
'వైఫ్ స్వాపింగ్' కేసులో దంపతులకు ఊరట
భువనేశ్వర్: ఒడిశాలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులు, ఆయన కుమారుడిని ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్తింటి వారు వేధిస్తున్నారని త్రైలోక్య మిశ్రా కోడలు లోపముద్ర మిశ్రా స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అత్త, మామలు, భర్త అరెస్టులో జాప్యం చేస్తే తనకు, తన బిడ్డకు ప్రాణాపాయం ముంచుకు వస్తుందని బాధితురాలు పోలీసులకు తెలిపారు. కాగా, పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులు, ఆయన కుమారుడిని ఈనెల 29 వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా కోర్టులో పోలీసులు కేసు డైరీ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పెళ్లయిన తొలి రోజుల నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త వేధింపులకు అత్త, మామ పరోక్షంగా కొమ్ముకాసి తన సహనానికి పరీక్ష పెట్టినట్టు లోపముద్ర మిశ్రా అంతకుముందు ఆరోపించారు. హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో వైఫ్ స్వాపింగ్(భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో భర్త వేధింపులు ప్రారంభమైనట్టు తెలిపారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో వివాహం జరిగిందని పేర్కొన్నారు. -
వైఫ్-స్వాపింగ్ ఆరోపణలపై విచారణకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: తన భర్త, అతని స్నేహితులు వైఫ్-స్వాపింగ్ (భార్యలను మార్చుకోవడం) పార్టీలు చేసుకున్నారని, వారి గ్రూపులో చేరనందుకు తనను చిత్రహింసలకు గురిచేశారంటూ ఓ నావీ ఆఫీసర్ భార్య చేసిన సంచలన ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలలలోపు విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013, ఏప్రిల్ 4న కోచి హార్బర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. బాధితురాలికి 2012 మార్చిలో ఓ నావీ ఆఫీసర్‌తో వివాహం అయింది. అనంతరం ఆమె భర్త వెంట కోచికి వెళ్లింది. తన భర్త, ఇతర నావీ అధికారులు వైఫ్-స్వాపింగ్ పార్టీలు చేసుకునేవారని, ఆ పార్టీలో పాల్గొనాల్సిందిగా తన భర్త ఒత్తిడి చేసేవారని ఆమె ఆరోపించింది. ఈ పార్టీల్లో పాల్గొనేందుకు నిరాకరించినందుకు తన భర్త వేధించాడని చెప్పింది. ఓ సీనియర్ ఆఫీసర్ భార్యతో తన భర్తను అభ్యంతరకర పరిస్థితిలో చూశానని ఆరోపించింది. తన భర్త స్నేహితులు, కొలీగ్స్, పైఅధికారులు తనను లైంగికంగా వేధించారని చెప్పింది. భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నారంటూ ఆరోపించింది. భర్త, అతని కుటుంబ సభ్యులతో పాటు ఐదుగురు నావీ అధికారులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదుగురు నావీ అధికారులు, ఈ అధికారుల్లో ఒకరి భార్య తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది. తొలుత ఈ కేసు కేరళ హైకోర్టులో విచారణకు వచ్చింది. కేరళలో తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. సీబీఐతో విచారణ చేయించాలని కోర్టుకు విన్నవించింది. ఆమె విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు కేరళ పోలీసులు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. -
భార్యల మార్పిడి కేసు: మహిళ ఫిర్యాదు స్వీకరించిన సుప్రీంకోర్టు
తన భర్తతో పాటు కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌కు చెందిన కొంతమంది అధికారులు చేస్తున్న భార్యల మార్పిడి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఓ నౌకాదళ అధికారి భార్య దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తనను బలవంతంగా భార్యల మార్పిడి పార్టీలలో పాల్గొనాలంటూ తన భర్త చిత్ర హింసలు పెడుతున్నాడని ఆమె అందులో పేర్కొంది. ఈ కేసును విచారణకు స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. దాంతో పాటు.. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి ఊరట ఇవ్వకుండా కేరళ హైకోర్టును ఆదేశించాలన్న పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించింది. కేరళ పోలీసులు తన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ చేయడంలేదంటూ ఫిర్యాదు చేసిన ఆమె.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కోరింది. స్థానిక పోలీసులపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉండటంతో వారు దీన్ని కేవలం ఒక వివాహ వివాదంగా చూస్తున్నారని, కేసు తీవ్రతను నీరుగార్చి, నౌకాదళ అధికారులపైకి ఏమీ రాకుండా చూసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తనను చిత్రహింసలు పెట్టారనడానికి కావల్సిన ఆధారాలను కూడా ఆమె సమర్పించారు. 'భార్యల మార్పిడి' పార్టీల ఆహ్వాన పత్రాలను కూడా ఫిర్యాదుకు జతచేశారు. మార్చి ఐదో తేదీన నౌకాదళ ప్రధానాధికారికి కూడా దీని విషయమై ఓ లేఖ రాశానని, అయినా దాన్ని పట్టించుకోలేదని తెలిపారు.