తన భర్తతో పాటు కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్కు చెందిన కొంతమంది అధికారులు చేస్తున్న భార్యల మార్పిడి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఓ నౌకాదళ అధికారి భార్య దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తనను బలవంతంగా భార్యల మార్పిడి పార్టీలలో పాల్గొనాలంటూ తన భర్త చిత్ర హింసలు పెడుతున్నాడని ఆమె అందులో పేర్కొంది. ఈ కేసును విచారణకు స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. దాంతో పాటు.. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి ఊరట ఇవ్వకుండా కేరళ హైకోర్టును ఆదేశించాలన్న పిటిషన్ను కూడా విచారణకు స్వీకరించింది.
కేరళ పోలీసులు తన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ చేయడంలేదంటూ ఫిర్యాదు చేసిన ఆమె.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కోరింది. స్థానిక పోలీసులపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉండటంతో వారు దీన్ని కేవలం ఒక వివాహ వివాదంగా చూస్తున్నారని, కేసు తీవ్రతను నీరుగార్చి, నౌకాదళ అధికారులపైకి ఏమీ రాకుండా చూసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
తనను చిత్రహింసలు పెట్టారనడానికి కావల్సిన ఆధారాలను కూడా ఆమె సమర్పించారు. 'భార్యల మార్పిడి' పార్టీల ఆహ్వాన పత్రాలను కూడా ఫిర్యాదుకు జతచేశారు. మార్చి ఐదో తేదీన నౌకాదళ ప్రధానాధికారికి కూడా దీని విషయమై ఓ లేఖ రాశానని, అయినా దాన్ని పట్టించుకోలేదని తెలిపారు.
భార్యల మార్పిడి కేసు: మహిళ ఫిర్యాదు స్వీకరించిన సుప్రీంకోర్టు
Published Fri, Sep 20 2013 8:11 PM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement