కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది.
సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్‌ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్‌ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి.
ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్‌జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్‌షాజహాన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది.
ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్‌ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి.
ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు
Comments
Please login to add a commentAdd a comment