వైఫ్-స్వాపింగ్ ఆరోపణలపై విచారణకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: తన భర్త, అతని స్నేహితులు వైఫ్-స్వాపింగ్ (భార్యలను మార్చుకోవడం) పార్టీలు చేసుకున్నారని, వారి గ్రూపులో చేరనందుకు తనను చిత్రహింసలకు గురిచేశారంటూ ఓ నావీ ఆఫీసర్ భార్య చేసిన సంచలన ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలలలోపు విచారణ పూర్తి చేయాలని గడువు విధించింది. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013, ఏప్రిల్ 4న కోచి హార్బర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
బాధితురాలికి 2012 మార్చిలో ఓ నావీ ఆఫీసర్తో వివాహం అయింది. అనంతరం ఆమె భర్త వెంట కోచికి వెళ్లింది. తన భర్త, ఇతర నావీ అధికారులు వైఫ్-స్వాపింగ్ పార్టీలు చేసుకునేవారని, ఆ పార్టీలో పాల్గొనాల్సిందిగా తన భర్త ఒత్తిడి చేసేవారని ఆమె ఆరోపించింది. ఈ పార్టీల్లో పాల్గొనేందుకు నిరాకరించినందుకు తన భర్త వేధించాడని చెప్పింది. ఓ సీనియర్ ఆఫీసర్ భార్యతో తన భర్తను అభ్యంతరకర పరిస్థితిలో చూశానని ఆరోపించింది. తన భర్త స్నేహితులు, కొలీగ్స్, పైఅధికారులు తనను లైంగికంగా వేధించారని చెప్పింది. భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నారంటూ ఆరోపించింది. భర్త, అతని కుటుంబ సభ్యులతో పాటు ఐదుగురు నావీ అధికారులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదుగురు నావీ అధికారులు, ఈ అధికారుల్లో ఒకరి భార్య తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది.
తొలుత ఈ కేసు కేరళ హైకోర్టులో విచారణకు వచ్చింది. కేరళలో తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. సీబీఐతో విచారణ చేయించాలని కోర్టుకు విన్నవించింది. ఆమె విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు కేరళ పోలీసులు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.