45 లక్షలు గెలిచారని చెప్పి.. 11 లక్షలు దోచేసి..
బెంగళూరు: మీకు లాటరీ తగిలింది కొన్ని లక్షల రూపాయలను మీరు డిపాజిట్ చేస్తే మేం మీకు మొత్తం అందజేస్తాం అనే ఘరానా మోసాలు మనకు తరచూ కనిపించేవే. అలాంటి ఘటనే ఓ గృహిణికి ఎదురైంది. ఓ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్య అయిన ఆమె వంచనకు గురై కుటుంబసభ్యుల ముందు అవమాన భారాన్ని తట్టుకోలేక తనంతట తానే ప్రాణాలను తీసుకునేలా చేసింది. మీరు రూ.45 లక్షల నగదును బహుమతిగా గెలుచుకున్నారంటూ బెంగళూరు వివేకానంద రోడ్డులో నివసించే ఓ సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ భార్య వీ పాలక్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఆ నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించగా ఆ డబ్బు ఇవ్వాలంటే రూ.11 లక్షలను ముందుగా డిపాజిట్ చేయాలని వారు చెప్పారు.
దాంతో భర్తకు తెలియకుండా డబ్బును సేకరించిన ఆమె వివిధ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. 11 లక్షల నగదును రాహుల్, హస్ నాథ్, షబ్బీర్ తదితరుల అకౌంట్లకు బదిలీ చేశారు. ఆ తర్వాత డబ్బును తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని చెప్పడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ మోసపోయామని తెలుసుకున్న ఆమె.. తిరిగి ఇంటికి వచ్చి ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. దీంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ఆండ్రూని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా ఆమె తరచు డబ్బు పంపుతుండటంతో ఏదో ఒక కారణం చూపుతూ డబ్బును రాబట్టాలని ప్రయత్నించినట్లు చెప్పాడు. ఢిల్లీకి వచ్చిన ఆమెను మరికొంత డబ్బు అడగగా ఇంక తన వద్ద డబ్బు లేదని చెప్పినట్లు చెప్పాడు.
ఢిల్లీ నుంచి తిరిగి బెంగుళూరుకు వెళ్లిన మర్నాడు పురుగుల మందు తాగబోతుంటే పిల్లలు రక్షించినట్లు చెప్పిందనీ, ఎలాగైనా ప్రైజ్ మనీని ఇవ్వాలని కోరినట్లు వివరించాడు. కుటుంబసభ్యులు ఏమైందని ప్రశ్నించగా.. పాలక్ జరిగిన విషయం వారికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదుచేద్దామని వారు చెప్పడంతో అప్పటికి ఊరుకున్న పాలక్.. మర్నాడు పోలీస్ స్టేషన్ కు బయల్దేరబోతూ బెడ్ రూంలో ఉరేసుకుని చనిపోయినట్లు వివరించారు.