ఉద్యోగం చేయమన్నందుకు ప్రాణం తీశాడు
భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య
అనాథ అయినా ఇష్టపడి వివాహం చేసుకున్నందుకు..
పనీపాటా లేకుండా అతను ఖాళీగా తిరుగుతున్నాడు. కనీసం నలుగురిలో చెప్పుకోవటానికైనా ఉద్యోగం చేయమని ఆమె అతన్ని కోరింది. దానికి అతను ససేమిరా అన్నాడు. భార్య మాత్రం పదేపదే ఈ విషయాన్ని గుర్తు చేస్తుండటంతో భర్తకు ఆగ్రహం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య రోజు గొడవలు, వివాదాలు ముదిరి చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి.
విజయవాడ(పూర్ణానందంపేట) : పట్టరాని కోపంతో భర్త భార్యను హతమార్చి చివరకు అతను ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం స్థానిక ఆర్ట్పేటలో చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్ట్పేటకు చెందిన తాటి ఉమాదేవి(30)కి పెజ్జోనిపేటకు చెందిన మునిజేటి రాజు(35)తో రెండేళ్ల కిత్రం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వివాహంకాక ముందే కొన్నేళ్లపాటు ఆర్ట్పేటలోని ఒక ఇంట్లో కలిసి ఉన్నారు. అయితే ఐదేళ్ల క్రితం ఉమాదేవి తండ్రి రామరాజు మరణించటంతో ఆయన ఉద్యోగం కుమార్తెకు వచ్చింది. రాజు ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌గా పని చేశాడు. అయితే భార్య రైల్వేలో ఉద్యోగి కావటంతో రాజు జల్సాలకు అలవాటుపడి పనిపాట లేకుండా తిరుగుతున్నాడు. ఈక్రమంలో భర్త ఖాళీ తిరుగుతున్నావని భార్య పదేపదే అడుగుతుండటంతో రాజు తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఇటీవల రాజు కుడి కాలికి దెబ్బతగిలి సెప్టిక్ అయింది. గత రెండు నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు.
ఇంటికి వచ్చిన దగ్గర నుంచి భార్య, కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదని గొడవపడి ఉమాదేవిని కొడుతుండేవాడు. గురువారం రాత్రి వారి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాజు ఉమాదేవి తలను గోడకేసి మోది కిరాతకంగా హత్య చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. ఈ ఘటనతో భయపడిన రాజు ఇంటి సీలింగ్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం ఎంతసేపటికి కూతురు, అల్లుడు బయటకు రాకపోవడంతో ఉమాదేవి తల్లి రత్తమ్మ పైకి వెళ్లి తలుపు తట్టి లేపినా తలుపు తియకపోడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ సత్యనారాయణ సిబ్బందితో అక్కడకు చేరుకుని తలుపుతు పగులకొట్టి చూడగా మంచంపై ఉమాదేవి విగత జీవిగా పడిఉండగా రాజు సీలింగ్‌కు వేలాడుతు కనిపించాడు. దీనిపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్షణికావేశంలో..
అనాథగా ఉన్న రాజును ఇష్టపడి కలిసి ఉండి వివాహం చేసుకున్నందుకు చివరికి ఆమె అతని చేతుల్లోనే బలి అయింది. డబ్బులు కోసం కాకుండా ఏదైనా పని చేయమని భర్తను అడిగినందుకు రాజు క్షణికావేశంలో పట్టరాని కోపంతో భార్యను హత్య చేశాడని తెలుస్తోంది. సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని పూర్తిస్థాయిలో దర్యాపు నిర్వహించి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు.