Wild Bear
-
జనావాసాల్లోకి ఎలుగుబంటి
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలో ఎలుగుబంటి సంచారం అలజడి రేపింది. బుధవారం రాత్రి ఎలుగబంటి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుంచి డివైడర్ దాటుతుండగా మారం శ్రీనివాస్ తన కారులో వెళ్తూ వీడియో తీశాడు. గురువారం ఉదయం రాజీవ్ చౌరస్తా నుంచి లక్ష్మీనారాయణపురం గ్రామంలోని పంట పొలాల్లో సంచరించింది. దీంతో స్థానికులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. అచూకీ కోసం పోలీసులు వెదకడం మొదలుపెట్టారు. పాలకుర్తి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేశ్ ఎలుగుబంటి పాదముద్రలను సేకరించారు. -
ముప్పతిప్పలు పెట్టి.. చివరకు చిక్కింది
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ఓ ఎలుగుబంటి ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నిన్న రాత్రి బొమ్మకల్‌కు వచ్చిన ఎలుగుబంటిని గ్రామస్తులు తరిమికొట్టడంతో అది కరీంనగర్‌కు చేరుకుంది. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద పాగా వేసింది. ఉదయం పేపర్ వేయటానికి అటుగా వచ్చిన పేపర్‌బాయ్స్ దాన్ని చూసి ఒక్కసారిగా హడలిపోయారు. నిత్యం రద్దీగా ఉండే టవల్ సర్కిల్ ప్రాంతంలోకి ఎలుగుబంటి రావటంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి షాపులను బంద్ చేయించారు. దాదాపు ఏడు గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ఫలించింది. దొరకకుండా ముప్పతిప్పలు పెట్టిన ఎలుగుబంటి అధికారుల చేతికి చిక్కింది. డీఎఫ్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బంధించిన ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామన్నారు. వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేయటంతో జనావాసాల్లోకి వన్యప్రాణులు వస్తున్నాయని తెలిపారు. వన్యప్రాణులను రక్షించేందుకే పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. -
శివాలయంలో నక్కిన ఎలుగుబంటి
కరీంనగర్: గంగిపల్లి గ్రామస్థులను గాబరా పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. గ్రామస్థుల సహాయంలో అటవీ అధికారులు దాన్ని పట్టుకున్నారు. కరీంనగర్జిల్లా గంగిపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడ్నించి, ఎలా వచ్చిందో గానీ శివాలయంలో దూరింది. ఉదయం పూజ చేయడానికి వచ్చిన పూజారి దాన్ని గమనించి ఆలయ తలుపులు మూసేయడంతో లోపలే తచ్చాడింది. ఎలుగుబంటిని చూసి గ్రామస్థులు భయపడిపోయారు. వెంటనే పోలీసులకు, అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు దాన్ని బంధించారు. ఆలయ గోడ దూకి పంటపొలాల్లోకి పారిపోయిన ఎలుగుబంటిని ఎంతో శ్రమించి పట్టుకున్నారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.