శివాలయంలో నక్కిన ఎలుగుబంటి
కరీంనగర్: గంగిపల్లి గ్రామస్థులను గాబరా పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. గ్రామస్థుల సహాయంలో అటవీ అధికారులు దాన్ని పట్టుకున్నారు. కరీంనగర్జిల్లా గంగిపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడ్నించి, ఎలా వచ్చిందో గానీ శివాలయంలో దూరింది. ఉదయం పూజ చేయడానికి వచ్చిన పూజారి దాన్ని గమనించి ఆలయ తలుపులు మూసేయడంతో లోపలే తచ్చాడింది.
ఎలుగుబంటిని చూసి గ్రామస్థులు భయపడిపోయారు. వెంటనే పోలీసులకు, అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. వరంగల్ నుంచి వచ్చిన అటవీ అధికారులు దాన్ని బంధించారు. ఆలయ గోడ దూకి పంటపొలాల్లోకి పారిపోయిన ఎలుగుబంటిని ఎంతో శ్రమించి పట్టుకున్నారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.