కొండగొర్రె మాంసం స్వాధీనం
రామాయంపేట: పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఒక ఇంట్లో రహస్యంగా దాచి ఉంచిన నాలుగు కిలోల కొండగొర్రె మాంసాన్ని మంగళవారంరాత్రి అటవీశాఖ అధికారులు స్వాధీనపర్చుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్థానిక అటవీ రేంజీ అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు... కాలనీకి చెందిన పిట్టల రాజు కొంత కాలంగా అడవి జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కొండగొర్రె మాంసాన్ని తన ఇంటిలో దాచిఉంచగా.. ఈవిషయాన్ని కొందరు స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్కు ఫిర్యాదు చేశారు.
దీనితో ఎస్ఐ విషయాన్ని అటవీఅధికారికి దృష్టికి తెచ్చారు. డిప్యూటీ రేంజ్ అధికారి కిరణ్, సెక్షన్ అధికారి దుర్గయ్య, బీట్ అధికారులు చిరంజీవి, కిశోర్ కలిసి రాజు ఇంటిపై దాడి చేసి మాంసాన్ని స్వాధీనపర్చుకొని రాజును కస్టడీలోకి తీసుకున్నారు. ఈమేరకు అతన్ని అరెస్ట్ చేసి మాంసంతోపాటు జంతువులను వధించడానికి వినియోగించే కత్తి, తక్కెడను స్వాధీనపర్చుకున్నారు.