సీఎం తల తెగ్గొడతానన్న నేత అరెస్టు
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు స్థానిక బీజేపీ నాయకుడొకరు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తనకు ఇష్టం వచ్చిన తిండి తింటానని, బీఫ్ తినకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని అన్న ముఖ్యమంత్రికి దమ్ముంటే షిమోగా వచ్చి అక్కడ ఏదైనా ఆవును చంపి తినాలని బీజేపీ జిల్లా కార్యదర్శి ఎస్ఎన్ చెన్నబసప్ప సవాలు చేశారు. ఆయన వచ్చి అలా చేస్తే.. సీఎం తల తెగ్గొట్టి దాంతో ఫుట్బాల్ ఆడుకుంటామని హెచ్చరించారు. సిద్దరామయ్య చెబుతున్నది, చేస్తున్నది అంతా తప్పని అన్నారు. అయితే ఇలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు చెన్నబసప్పను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.
తాను ఇంతవరకు ఎప్పుడూ బీఫ్ తినలేదని, అయితే తాను తినాలనుకుంటే మాత్రం ఎవరూ ఆపలేరని సీఎం సిద్దరామయ్య గత వారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాను తినాలనుకునే బీఫ్, పోర్క్ లేదా మరే ఇతర మాంసమైనా తింటానని చెప్పారు. బీఫ్ తినే విషయమై అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ నుంచి నిరసనలు రావడంతో మరింత ఘాటు పెంచి అలా అన్నారు. కానీ దీనిపై చెన్నబసప్ప తీవ్రస్థాయిలో మండిపడి ఏకంగా సీఎం తల తీసేస్తానని హెచ్చరించడం విశేషం.